వెండితెర నవలలపై ఇది ఓ పరిశోధన!- ప్రముఖ దర్శకులు, రచయిత వంశీ
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ రాసిన ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ, పుస్తక రూపశిల్పి సైదేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ‘‘1950, 60, 70లలో తెలుగునాట వెండితెర నవలలు ఓ వెలుగు వెలిగాయి. వాటిల్లో నాకు గురువుగారు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన పుస్తకాలు ఇష్టం. నేను కూడా ఓ నాలుగు వెండితెర నవలలు రాశాను. అందులో ‘తాయారమ్మ - బంగారయ్య’ మాత్రం పబ్లిష్ కాలేదు. మిగిలినవి పుస్తక రూపంలో వచ్చాయి. నేను రాసిన వెండితెర నవలల్లో బాగా పాపులర్ అయ్యింది ‘శంకరాభరణం’ వెండితెర నవల. ఆ పాపులారిటీకి కారణం నేను రాసిన విధానం కాదు, అంత గొప్పగా ఆ సినిమాను మా గురువుగారు కె. విశ్వనాథ్ తెరకెక్కించారు. ఇలా తెలుగులో ఉన్న అనేక వెండితెర నవలల మీద ఇలాంటి పరిశోధనాత్మక రచన ఇంతకు ముందు నాకు తెలిసి ఎవరూ రాయలేదు, రాలేదు. ఇవాళ పులగం చిన్నారాయణ, మిత్రుడు ఓం ప్రకాశ్ నారాయణ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది పుస్తక రూపంలోకి రాక ముందు నుండి వీరు చేస్తున్న పరిశోధన గురించి నాకు తెలుసు. ఎవరెవరి దగ్గర వీరు సమాచారం సేకరిస్తున్నారు? ఎంతగా శ్రమ పడుతున్నారనేది ఓ అవగాహన ఉంది. ఈ పుస్తకంలో ఏ వెండితెర నవల ఎవరు రాశారు, అది ఎప్పుడు విడుదలైందనే పట్టిక కూడా ఇచ్చారు. ఇంత చక్కని పుస్తకం మంచి పాపులారిటీని తెచ్చుకుని, వెంటనే రీప్రింట్‌కు రావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
రైల్వే అధికారి, సాహితీ విశ్లేషకులు రవిప్రసాద్ పాడి మాట్లాడుతూ.. ‘‘సినిమా పబ్లిసిటీలో భాగంగా పాత రోజుల్లో పాటల పుస్తకాలు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, వెండితెర నవలలు వస్తుండేవి. అలా తెలుగు సినిమా తొలినాళ్ళలో వచ్చిన వెండితెర నవలల నుండి, నిన్నమొన్నటి ‘శ్రీరామరాజ్యం’, ‘టెంపర్’ వరకూ వచ్చిన అనేక రచనల వివరాలను పరిశోధించి, ఈ ‘వెండి చందమామలు’ రాయడం సంతోషాన్నిస్తోంది. ఇలాంటి రచనలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినీరంగానికి సంబంధించి ఇటీవల వచ్చిన అరుదైన పుస్తకాల్లో ఒకటిగా ‘వెండి చందమామలు’ నిలబడిపోతుంది. ఒక తరానికి తీపి జ్ఞాపకంగా, ఇప్పుడు కేవలం స్మృతిచిహ్నంగా మిగిలిపోతున్న వెండితెర నవలల మీద ఒక పరిశీలన, ఒక పరిశోధనగా ఈ రచన సాగింది. ఈ రచనలోని విషయమే కాదు, వినూత్నమైన సైజులో, అందంగా దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిరు పుస్తకం చదువుతుంటే మనం మళ్ళీ అరవైల్లోకి, డెబ్భైల్లోకి వెళ్ళిపోతాం. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొని చదవాలి. పెట్టిన ప్రతి రూపాయికీ విలువనిచ్చే పుస్తకం. సినీ ప్రేమికుల అందరి ఇళ్ళలోనూ ఉండాల్సిన పుస్తకం’’ అని అన్నారు.
పుస్తక రచయితల్లో ఒకరైన పులగం చిన్నారాయణ మాట్లాడుతూ.. ‘‘ఇరవై ఏళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా పనిచేసినా కలగని తృప్తి సినీరంగానికి సంబంధించిన రచనలు చేయడంతో నాకు ఎక్కువ కలిగింది. గతంలో నేను రాసిన పుస్తకాలకూ, ఇప్పటి ఈ పుస్తకానికీ ప్రేరణ వంశీ గారే! నేను తొలి నంది అవార్డును అందుకున్న పుస్తకం ‘ఆనాటి ఆనవాళ్ళు’కు ఆ పేరు సూచించింది కూడా వంశీ గారే. అలానే ‘వెండితెర నవల’పై పుస్తకం రాయమని నాకు, మిత్రుడు ఓంప్రకాశ్‌కు సలహా ఇచ్చింది కూడా ఆయనే. ఆయన లాంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఏర్పడడం జర్నలిస్ట్‌గా గొప్ప ఎఛివ్‌మెంట్‌గా భావిస్తుంటాను. ఈ ‘వెండి చందమామలు’ రచనను తొలిసారి ‘పులగమ్స్’ అనే పేరుతో సొంతంగా ప్రచురించాను. రెండో పుస్తకంగా ఇళయరాజా గురించి వంశీ రాసిన ‘స్వప్నరాగలీనమ్’ను ప్రచురించాలని భావిస్తున్నా’’ అని అన్నారు.
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా వడ్డి ఓంప్రకాశ్ మాట్లాడుతూ.. ‘‘మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా, అందులో దాదాపు ఇరవై ఏళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా సాధించింది ఏమిటీ? అని వెనుదిరిగి చూసుకుంటే... గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ కనిపించలేదు. ఓ కథాసంపుటిని, కార్టూన్ల పుస్తకాన్ని వేయడం తప్పితే... సినిమా రంగంతో ఉన్న అనుబంధాన్ని అక్షరీకరించలేకపోయాననే బాధ ఉంటుండేది. దానిని మిత్రుడు పులగం చిన్నారాయణ కారణంగా తీర్చుకోగలిగాను. అతని సూచనతోనే గతంలో మేం రాసిన ‘వెండితెర నవల’లకు సంబంధించిన వ్యాసాన్ని మరిన్ని వివరాలతో, విస్తరించి ‘వెండి చందమామలు’ పేరుతో పుస్తకంగా తీసుకురాగలిగాం. ఈ పుస్తకంలో కేవలం వెండితెర నవలల గురించి రాయడమే కాకుండా, స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ మొదలు ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీరమణ, వేమూరి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్దల అభిప్రాయాలు పొందుపరిచాం. ఇంతవరకూ వచ్చిన వెండితెర నవలల జాబితాను కూడా ఇచ్చాం. పరిశోధనా గ్రంథాన్ని తలపించే ఈ పుస్తకం అందరి మన్ననలూ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ సైదేశ్ ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలియచేశారు.