అవును మీరు వింటున్నది నిజమే.. తన తోటి మిత్రులు, ఆప్తులు.. సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు మెగాస్టార్ చిరంజీవి చిరు సలహా ఇచ్చారని ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. ఇది ఏ సినిమా గురుంచో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. పొలిటికల్‌గా ఆ ఇద్దరు స్టార్‌లకు చిరు సలహా ఇచ్చారట. ఇంతకీ వారికి మెగాస్టార్ ఏమని సలహా ఇచ్చారో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సినిమాలకు నాడు టాటా చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి.. ‘ప్రజారాజ్యం’ పార్టీని పెట్టి అదృష్టాన్ని పరిశీలించుకోవాలని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే మొదటి ప్రయత్నమే అట్టర్ ప్లాప్ కావడం.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడం.. ఇక రాజకీయాలు తనకు పనికిరావని ఖైదీ నంబర్-150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం విదితమే. అంటే రాజకీయాల్లో పూర్తిగా పీహెచ్‌డీ చేసేసిన చిరు ఇక వద్దనుకుని తన పాత రంగంలోకి వచ్చేశారు.
అయితే.. తమిళనాట కమలహాసన్ ఇప్పటికే ‘మక్కల్ నీధి మయ్యమ్’ స్థాపించగా.. రజనీకాంత్ త్వరలోనే పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తన మిత్రులకు చిరు రాజకీయ సలహా ఇచ్చారట. ‘ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దండి. ప్లీజ్.. మీరు రాజకీయాల్లోకి రాకండి’ అని సూచించారట. అంటే అర్థం తాను అంతా చూసొచ్చాశా.. మీరెళ్లి చేసేదేమీ లేదు.. మీకు రాజకీయాలు సెట్టవ్వవ్.. ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు అని పరోక్షంగా కమల్, రజనీలకు చిరు సూచించారన్న మాట. మరి మిత్రుడి సలహాను ఆ ఇద్దరు ఆప్తులు ఎంతవరకు పాటిస్తారో వేచి చూడాలి మరి.