టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 6న కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది. ఇలా వెంటిలేటర్‌పైనే వేణుకు వైద్యులు చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం 12:12 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యే కావాలని ఎన్నో కలలు కన్న ఆయన.. ఆ ఆఖరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. 20 ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్‌కు రాజకీయాల్లోనూ రాణించాలనే ఆకాంక్ష పుట్టింది. అంతేకాదు టీడీపీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. తన సొంత ఊరైన కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నామినేషన్ దాకా వెళ్లడం మళ్లీ వెనుదిరగడమే సరిపోయింది.
వాస్తవానికి 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన ఆయన టీడీపీ అధిష్టానాన్ని ఒప్పించడానికి చాలానే ప్రయత్నాలు చేశారు. అయితే అది వర్కవుట్ అవ్వలేదు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే.. ఈ టెర్మ్‌లో నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో ఆయన ఆఖరి కోరిక తీరలేదు. ఇటు సినిమాలకు.. అటు రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయి.. అనారోగ్యంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.