మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించిన నటించిన చిత్రం ‘సైరా’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా.. చిరు తనయుడు రామ్‌చరణ్ నిర్మించారు. కాగా ఈ సినిమా అనుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ వివాదాలే. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి కుటుంబీకులు, బంధువులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అందుకు రివర్స్‌గా చిత్రబృందం కేసులు వేయడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.
సైరా నరసింహారెడ్డి సినిమాపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులు ఫిర్యాదు చేశారు. కొణిదెల ప్రొడక్షన్ అధినేత రామ్‌చరణ్, చిరంజీవిపై ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడకు సంబంధించిన ఆధారాలను.. మా వద్ద నుంచి సేకరించి, తప్పుడు కేసులు పెట్టారని సైరా బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వివరాలను తీసుకుని డబ్బులు ఇస్తామని మోసం చేశారని వారసులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఇదే విషయం అడగడానికి గతంలో చిరంజీవి ఇంటికి వెళ్తే అక్రమంగా కేసులు పెట్టారన్న ఉయ్యాలవాడ వారసులు మీడియాకు చెప్పి కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే అగ్రిమెంట్ చేసుకుని చిత్ర యూనిట్ మోసం చేసిందని వారసులు చెబుతున్నారు.
వాస్తవానికి.. 23 మందికి గాను రూ. 50 కోట్లు ఇస్తామని చిత్ర యూనిట్ ఇదివరకే మాటిచ్చింది. అంతేకాదు.. ఆ యాభైకోట్లకు ట్యాక్స్ కూడా తామే చెల్లిస్తామని చిత్ర యూనిట్ హామీ ఇచ్చింది. ఈ 23మందిలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ ఇచ్చినందుకు ఒక్కోక్కరికి 2 కోట్లు ఇస్తామన్న చిత్ర యూనిట్ హామీ ఇవ్వగా.. చట్ట పరంగా అగ్రీమెంట్ తీసుకుని సినిమా అంతా అయిపోయాక.. చిత్ర యూనిట్ మోసం చేసిందని వారసులు వాపోతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? అసలు ఈ విషయంపై దర్శకనిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో..? ఈ ఆరోపణల్లో నిజానిజాలు తెలియాలంటే చెర్రీ లేదా సురేందర్ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పుకుంటారో వేచి చూడాలి మరి.