‘షాక్’, ‘మిరపకాయ్’,‘గబ్బర్‌సింగ్’, ‘డీజే’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తాజా చిత్రం ‘వాల్మీకి’. వరుణ్ తేజ్, పూజా హెగ్దే నటించి ఈ మూవీ సెప్టెంబర్-20న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను దర్శకనిర్మాతలు గట్టిగానే ప్లాన్ చేశారు. తాజాగా.. దర్శకుడు హరీశ్ మీడియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా సినిమాతో పాటు తన తదుపరి ప్రాజెక్టులు.. ఇలా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు.. ఇదే ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో సినిమాలపై కూడా ఈ కమర్షియల్ డైరెక్టర్ పెదవి విప్పారు.
ఇండస్ట్రీలో ఎవరికైనా రుణపడ్డానన్న భావన కలిగిందా? అనే ప్రశ్నకు హరీశ్ చాలా లాజిక్‌గా సమాధానమిచ్చారు. ‘అవునండి.. నేను జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా రుణపడి ఉన్నాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేక పోయాను. నిజంగా.. ఎప్పటికైనా జూనియర్‌తో మంచి హిట్ మూవీ తీసి రుణం తీర్చుకోవాలి’ అని అనుకుంటున్నట్లు హరీశ్ తన మనసులోని మాటను చెప్పారు.
కాగా.. ఇప్పటికే జూనియర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా చేసిన హరీశ్.. ఆశించినంతగా హిట్ అవ్వలేదు. దీంతో మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా చేసి హిట్టివ్వాలని ఈయన ఫిక్స్ అయ్యారు. మరి ఈసారి ఎలాంటి కథతో హరీశ్.. నందమూరి అభిమానుల ముందుకొస్తారో వేచి చూడాల్సిందే మరి.