‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ క్రీజులోకి వచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న ‘జనగణమన’ కూడా త్వరలో పట్టాలెక్కిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ ఈ ‘జనగణమన’ను కేజీఎఫ్ హీరో యశ్, విజయదేవరకొండలతో పూరీ తెరకెక్కిస్తారని వార్తలు వినవచ్చాయి.
అయితే అదంతా తూచ్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడట. వాస్తవానికి ఈ కథ మొత్తం సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం పూరీ రాసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. అయితే ఈ కథ గురించి ప్రభాస్ తెలుసుకుని ‘బాగుంది.. డార్లింగ్’ అని పూరీని అన్నాడట. ఇక అప్పట్నుంచి ప్రభాస్‌కు పూరీ టచ్‌లో ఉంటూ వస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్‌ను త్వరలోనే లైన్‌లో పెట్టి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
ఇప్పటికే పూరీ-ప్రభాస్ కాంబోలో ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా ఆశించినదానికంటే మంచి వసూలు చేశాయి. ‘జనగణమన’కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. ముచ్చటగా మూడో సినిమా ఈ కాంబోలో వస్తుందన్న మాట. మరి బుజ్జిగాడు ఏ మాత్రం కథ మెచ్చుకుని పూరీతో సినిమా చేస్తాడో వేచి చూడాలి మరి.