మెగాస్టార్ చిరంజీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం తర్వాత.. కొరటాల శివ కాంబోలో సినిమా ఉంటుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం విదితమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ కాంబోలో వస్తున్న సినిమాలో చిరు పాత్ర ఇలా అంటుంది..? అలా ఉంటుంది..? సినిమాలో చిరు డబుల్ రోల్..? ఇలా పలు రకాలు పుకార్లు షికార్లు చేశాయి.
అంతేకాదు డ్యూయల్ రోల్‌లో ఒకటి నక్సలైట్ నేపథ్యంలో ఉంటుందని కూడా వార్తలు వచ్చేశాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ చేయట్లేదట. సింగిల్ రోల్‌లోనే సామాజిక నేపథ్యమున్న కథ అని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన పుకార్లలో ఇదొక్కటా.. లేకుంటే ఇందులో అయినా నిజముందా అనేది తెలియాల్సి ఉంది.
కాగా.. షూటింగ్‌కు సర్వం సిద్ధం చేసుకున్న కొరటాల.. ఇటీవలే సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే ఇక మిగిలింది చిరు సరసన నటించేందుకు నటీమణి కోసమే వేట కొనసాగుతోంది. ఇప్పటికే కాజల్, తమన్నా, ఇలియానా ఇలా పలుపేర్లు తెరపైకి రాగా.. త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారని సమాచారం.