సంచలనాత్మక చిత్రం ‘ఆర్.ఎక్స్.100’ నిర్మించిన బ్యానర్‌లో హీరో కార్తికేయ కొత్త చిత్రం ‘90 ఎంఎల్’
‘ఆర్.ఎక్స్.100’ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర ఝుమ్... ఝుమ్మంటూ సందడి చేసింది. న్యూవేవ్ సినిమాగా, కల్ట్ మూవీగా భారీ విజయాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా చోటుచేసుకుంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించింది కార్తికేయ క్రియేటివ్ వర్క్స్. ఆ సినిమా ద్వారా గొప్ప గుర్తింపు పొందిన హీరో కార్తికేయ. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి నాయికగా నటిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
తాజా చిత్రం ‘90ఎంఎల్’ గురించి నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌరవం ఎంత గొప్పగా దక్కుతుందో, బాక్సాఫీస్ గలగలలు ఎంత సందడిగా ఉంటాయో మాకు ‘ఆర్.ఎక్స్.100’ ద్వారా తెలిసింది. గతేడాది జూలై 12న మా ‘ఆర్.ఎక్స్.100’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా చిత్రం విడుదలై ఏడాది గడిచినా ‘ఆర్.ఎక్స్.100’లాంటి సినిమా అంటూ... సినీ ప్రియులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, యావత్ సినీ ప్రేక్షకుల మనస్సులనూ దోచుకున్న చిత్రమది. ఈ చిత్రంతో మా హీరో కార్తికేయకు బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ ఏడాదిలో ఆయన వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మా కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రానికి ‘90ఎంఎల్’ అని పేరు పెట్టాం. టైటిల్‌కి తగ్గట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు శేఖర్ రెడ్డి కొత్తవాడైనా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. మా బ్యానర్ నుంచి వచ్చే చిత్రాలు ఏవైనా సరే ‘ఆర్.ఎక్స్.100’ విజయపరంపరను కొనసాగించేవే అయి ఉంటాయి’’ అని అన్నారు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ అనగానే ఎవరికైనా ‘ఆర్.ఎక్స్.100’ గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఎంతో మందికి ఆ సినిమా ఓ రెఫరెన్స్ గా మిగిలింది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంతకుమించి ఉండేలా ‘90 ఎంఎల్’ కథ రాసుకున్నాను. పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేసే కథ ఇది. కమర్షియల్ వేల్యూస్ మెండుగా ఉంటాయి. ‘90 ఎంఎల్’ అని టైటిల్ చెప్పగానే చాలా మంది ‘ఇంట్రస్టింగ్’ అన్నారు. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా వస్తోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. మొత్తం ఆరు పాటలున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. చంద్రబోస్‌గారు యువతను ఆకట్టుకునేలా పాటలు రాశారు. ‘రంగస్థలం’ తర్వాత చంద్రబోస్ గారు మళ్లీ సింగిల్ కార్డు రాసింది మా సినిమాకే. ప్రతి పాటా ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుంది. ఇటీవల ‘సైరా’లో కీలక పాత్రలో నటించిన రవికిషన్ మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. ‘90 ఎంఎల్’ అనే టైటిల్ ఎందుకుపెట్టాం? దాని కథాకమామీషు ఏంటనేది తెరమీద చూస్తేనే బావుంటుంది. ఈ నెల 11 నుంచి హైదరాబాద్‌లో క్లైమాక్స్ తెరకెక్కిస్తాం. దీని తర్వాత మరో షెడ్యూల్లో బ్యాలన్స్ టాకీ, 2 పాటలను చిత్రీకరిస్తాం. అంతటితో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కథ, కథనం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయి’’ అని అన్నారు.