సెప్టెంబర్ 13 విడుదల కాబోతున్న రెండు మీడియం బడ్జెట్ చిత్రాలైన గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాల టైటిల్స్ వివాదంలో గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయం కాస్త సద్దుమణిగినా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్మీకి టైటిల్ విషయం మాత్రం సద్దుమణిగేలా కనబడ్డం లేదు. వాల్మీకి టైటిల్ విషయంలో మొదటినుండి రగడ జరుగుతూనే ఉంది. బోయ వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా వాల్మీకి సినిమా టైటిల్ ఉందని.. వాల్మీకి బోయలు గొడవ చేస్తున్నారు. మరో రెండు వారాల్లో విడుదలకాబోతున్న వాల్మీకి సినిమా టైటిల్ ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్ చెయ్యడమే కాదు.. బోయ వాల్మీకిలు ఇప్పుడు హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. వాల్మీకి టైటిల్ మార్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టైటిల్ మార్చాలని, అలాగే తమ కులం వారి హక్కులకు భంగం కలిగిస్తున్న చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుని కోరారు. మరి హరీష్ శంకర్ మాత్రం వాల్మీకి టైటిల్‌కి వారి కులస్తుల హక్కుల భంగానికి సంబంధం లేదని మొదటి నుండి వాదిస్తున్నాడు.
ఇలా ఈ టైటిల్ విషయంలో జరుగుతున్న గొడవ వల్ల ‘వాల్మీకి’ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ అయితే వస్తుంది. మరి డిఫ్రెంట్ క్యారెక్టర్‌లో కొత్త మేకోవర్ లో కనబడుతున్న వరుణ్ తేజ్.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటాయని... అవే సినిమాకి హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది.