తూనీగ ఫస్ట్ లుక్ విడుదల - చిత్ర బృందానికి ప్రముఖ దర్శకులు వేగేశ్న సతీశ్ అభినందన
హైద్రాబాద్ : ఒక దైవ రహస్యం.. ఒక ఇతిహాస తరంగం - తూనీగ.. అతిత్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకులు సతీశ్ వేగేశ్న సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంతా కొత్తవారే కలిసి సమష్టి కృషితో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ మరిన్ని మంచి చిత్రాల రూపకర్తగా పేరు తెచ్చుకోవాలనికోరుతూ.. అక్షరాభినందన అందించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం గొప్పపల్లె సంస్కృతికి ఆనవాలు అని, ఈ చిత్ర ప్రచార సారథి, వర్థమాన రచయిత రత్నకిశోర్ శంభుమహంతితో ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. అంతేకాక ఈ నెల నుంచి ఎందరెందరో మహనీయులు పుట్టారని, ఉద్యమ గుణం, అందరినీ ఆదరించే లక్షణం, శ్రమనే వేదంగా భావించే తత్వం పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతీయులు అంటే తనకో ప్రత్యేక గౌరవం, అభిమానం ఉన్నాయని అన్నారు. ప్రత్యేకంగా సాహిత్య పరంగా ఈ ప్రాంతం గొప్ప, గొప్ప ఉద్దండులను అందించిందని, ఈ ప్రాంతం నుంచి వచ్చి సినీ మాధ్యమంలో నిలదొక్కుకున్న మహనీయులు ఎందరెందరో ఉన్నారని, ఆ కోవలోనే ఈ తూనీగ చిత్ర దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ చేరుకోవాలని ఆశీర్వదించారు.
మొదటి నుంచి ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో గొప్ప ఆసక్తి రేపుతోందని, ఆ ఆసక్తికి కొనసాగింపుగా, ఆధునిక ఆలోచనల మేళవింపుగా ఈ సినిమా దృశ్యమానం చెందిందన్న భావన తనలో పుష్కలంగా ఉందని, ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని వస్తోన్న ఈ చిత్ర బృందంలో ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి మిగల్చాలని, కాసుల పంట పండించాలని, బాక్సాఫీసు బొనాంజాగా నిలవాలని పేర్కొంటూ.. మరో మారు చిత్ర బృందానికి శుభాభినందనలు అందించారు. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్, డిజిటల్ పోస్టర్స్, డిజిటల్ డైలాగ్ వగైరా వగైరా అన్నీ అన్నీ తననెంతో ఆకట్టుకున్నాయని, కొత్త వారికి బాసటగా నిలిచేందుకు తానెన్నడూ సిద్ధమేనని, ఇప్పుడిప్పుడే కథాబలం ఉన్న చిత్రాలు మంచి మార్కులు సంపాదించుకోవడమే కాక వసూళ్లు కూడా సాధించి ఆర్థిక, హార్థిక ఫలాలు అందుకుంటున్నాయని, ఇతిహాస ఆధారిత కథాంశంతో కొన్ని ఆసక్తిదాయక అంశాలను జోడించి తీర్చిదిద్దిన కథన రీతి ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా దర్శకులు సతీశ్ వేగేశ్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ మాట్లాడుతూ.. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇప్పటికే విడుదలయిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోందని, అదేవిధంగా నిర్మాణాంతర పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. చిన్న చిత్రం అయినప్పటికీ సాంకేతిక హంగులకు ఎక్కడా లోటివ్వక, ప్రేక్షకుడికో కొత్త అనుభూతి అందించేలా సినిమాను చిత్రీకరించామని చెప్పారు. తమ ప్రయత్నానికి మద్దతు పలుకుతూ అన్ని ప్రచురణ, ప్రసార మాధ్యమాలు ఎంతగానో సహకరిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా వినీత్ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందిస్తుండగా, డీఓపీగా హరీశ్ ఎదిగ, ఎడిటర్ గా ఆర్కే కుమార్, పబ్లిసిటీ డిజైనర్ గా ఎంకే ఎస్ మనోజ్ వ్యవహరిస్తున్నారు. కాన్సెప్ట్ ఆర్ట్ ను ధనుంజయ అండ్లూరి అందించారు. చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయిన సందర్భంగా దర్శకుడికి శ్రీకాకుళం ఫిల్మ్ క్లబ్ నిర్వాహకులు రమేశ్ నారాయణ్, శ్రీకాకుళం జిల్లా ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ మెట్ట నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.