కౌసల్య కృష్ణమూర్తి లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాతో తెలుగులో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 23 ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూ..
మీ గురించి చెప్పండి?
- నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. దాదాపు 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమాలలో నటించాను. చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు అని. మా నాన్నగారు రాజేష్ ‘మల్లెమొగ్గలు’, ‘రెండు జళ్ల సీత’, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్తయ్య శ్రీలక్ష్మి కమెడియన్‌గా మీ అందరికీ సుపరిచితురాలు. అమర్‌నాథ్‌గారు మా తాతగారు. ఆయన కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు ఉంది.
తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో చేసిన మీరు తెలుగులో ఇంతవరకు చేయకపోవడానికి కారణం?
- ఒక మంచి సినిమా కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేశాను. మీరు చూసుకుంటే తమిళ్‌లో నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. ‘కాకముట్టై’, ‘కణ’, ‘ధర్మదురై’, ‘వడచెన్నై’ వంటి విభిన్నతరహా చిత్రాల్లోనే ఎక్కువగా నటించాను. తెలుగులో కూడా మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ఒక మంచి సినిమాతోనే తెలుగులో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యింది?
- విజయ్ దేవరకొండ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో క్యారెక్టర్ కోసం ‘కణ’ టీజర్ చూసి నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సినిమా తమిళ్‌లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21న రిలీజై పెద్దహిట్ అయ్యింది. ఆ సినిమా నాకు చాలా అవార్డ్సు తెచ్చిపెట్టింది. తర్వాత రామారావుగారు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని రైట్స్ తీసుకొని నాతోనే తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో నిర్మించారు.
తమిళ్ సినిమాని తెలుగులో చేయడం ఎలా అనిపిస్తోంది?
- తమిళంలో ఈ సినిమాను చాలామంది ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు తమిళంలో నేను చూసి.. ఏఏ సీన్‌లైతే ఇంకా బాగా చేసుంటే బాగుండేది అనుకున్న సన్నివేశాల్ని తెలుగులో మళ్లీ చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాకి తమిళ్ ఆడియన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ కూడా ఇంకా మంచి రెస్పాన్స్ ఇస్తారని నమ్ముతున్నాను.
రాజేంద్రప్రసాద్‌తో వర్క్ చేయడం ఎలా అన్పించింది?
- రాజేంద్రప్రసాద్‌గారితో ఇది నా మొదటి సినిమా కాదు. గతంలో వచ్చిన ‘రాంబంటు’ సినిమాలో ఒక సాంగ్‌లో చిన్న క్యారెక్టర్ చేశాను. మళ్ళీ ఈ చిత్రంలో ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నేను నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. తమిళ్‌లో సత్యరాజ్‌గారితో ఎంత మంచి వైబ్స్ ఉందో తెలుగులో రాజేంద్రప్రసాద్‌గారితో కూడా అలాంటి ఫీల్ కలిగింది.
తెలుగు బాగా మాట్లాడుతున్నారు.. తెలుగు చదువుతారా?
- చదువుతాను. నేను తిరుపతిలో మోహన్‌బాబుగారి శ్రీవిద్యానికేతన్‌లో నాలుగైదేళ్లు చదువుకున్నాను. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాను.
తమిళ్‌లో చేసిన క్యారెక్టర్ మళ్లీ చేయడం ఎలా అన్పిస్తుంది?
- అదే క్యారెక్టర్ మళ్లీ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోనూ అది టఫ్ క్యారెక్టర్. తమిళ్‌లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగులో కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నా.
ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నారా?
- అవును. క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. షూటింగ్ గ్యాప్ దొరికితే క్రికెట్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తెలుగులోకి వచ్చినప్పుడు ఆ స్కిల్స్‌ని కొంచెం పాలిష్ చేశాను.
బౌలింగ్‌లో ఫస్ట్‌బాల్‌కే వికెట్ తీశారంట?
- తెలుగులో ఫస్ట్ షాట్ చేద్దామనుకున్నప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేద్దామని మూడు కెమెరాలు, ఒక డ్రోన్ కెమెరాతో షూట్ చేయడం జరిగింది. అలా ఫస్ట్‌టైమ్ బౌలింగ్ చేయగానే వికెట్ పడింది. దాంతో అందరూ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ అనుకున్నారు. ఈ సినిమాలో బౌలింగ్, బ్యాటింగ్ రెండూ ఎంజాయ్ చేశాను.
ఈ క్యారెక్టర్ చేయడానికి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన అంశాలేంటి?
- నా క్యారెక్టర్స్ అన్నీ విభిన్నంగానే ఉంటాయి. తమిళంలో ‘కాకముట్టై’ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాను. మలయాళంలో 70 సంవత్సరాల వృద్ధురాలుగా చేశాను. అలాగే హిందీలో కూడా 16 నుండి 65 సంవత్సరాల వయస్సుగల పాత్ర పోషించాను. నాకు క్రికెట్ రాదు. నేర్చుకొని చేస్తే ఇంకా ఛాలెంజింగ్‌గా ఉంటుందని ఈ సినిమా చేశాను.
నిర్మాత కె.ఎస్. రామారావు గురించి?
- ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆశ పడితే చాలదు.. దాన్ని పట్టుబట్టి సాధించాలి అని. ఆ డైలాగ్ కె.ఎస్. రామారావుగారికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆయన అంత పట్టు బట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి మెమొరబుల్ మూవీగా నిలుస్తుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ఇదే బేనర్‌లో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. అలాగే ‘మిస్ మ్యాచ్’ చిత్రం చేశాను. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాను.