లక్ష్, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా ‘బోయ్’. హైస్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిశూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్ 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం జరిగింది. రాజ్ కందుకూరి బిగ్ సీడీని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్ మాట్లాడుతూ.. ‘‘బోయ్ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వరాజ్ క్రియేషన్స్ నా సెకండ్ ఫ్యామిలీలా మారిపోయింది. అమర్‌గారికి, నిర్మాతలకు థ్యాంక్స్. నాకు సహకారం అందించిన అందరికీ థ్యాంక్స్. తప్పకుండా ‘బోయ్’ సినిమాను చూడండి’’ అన్నారు.
సాహితి మాట్లాడుతూ.. ‘‘మూవీని అందంగా డిజైన్ చేశారు. మాకు సపోర్ట్ అందించిన సీనియర్ ఆర్టిస్టులు, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. డైరెక్టర్ అమర్‌గారు చాలా కష్టపడి సినిమాను తీశారు. అష్కర్‌గారు మా వెన్నంటే ఉండి నడిపించారు. నిర్మాతలకు థ్యాంక్స్. చక్కటి సహకారం అందించారు. అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.
డైరెక్టర్ అమర్ విశ్వరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో బాగా నటించారు. ప్యాన్ ఇండియాలో ఈ సినిమాలో అబ్బాయి పాత్ర కోసం తిరిగాను. చివరకు ఆష్కర్ లక్ష్‌ను చూపించాడు. వెంటనే ఓకే చేసేశాను. తను ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అవుతాడు. తను దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాహితి..కూచిపూడి డ్యాన్సర్. అద్భుతంగా నటించింది. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నేను రాసిన కథను నటీనటులే క్యారీ చేశారు. ఆష్కర్ నా ప్రొడక్షన్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యి చేశాడు. సినిమా ఎలా తీశాననేది సినిమానే చెబుతుందనుకుంటున్నాను. ఆగస్ట్ 23న సినిమా విడుదలవుతుంది. రవిశంకర్ రాజుగారు ఎంతగానో సపోర్ట్ చేశారు’’ అన్నారు.
రాజ్‌కందుకూరి మాట్లాడుతూ.. ‘‘సినిమా ట్రైలర్ చూస్తే.. అందులో హానెస్ట్ కనపడుతుంది. తొలి సినిమా ఓ కమర్షియల్ సినిమానో, లవ్ సబ్జెక్టో చేయవచ్చు. కానీ.. బోయ్‌లాంటి సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. అమర్‌గారు సినిమాను తెరకెక్కించిన బ్యాక్‌డ్రాప్ నాకు ఎంతగానో నచ్చింది. గత నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సాంగ్స్ కూడా బావున్నాయి. అది కూడా 14-15 సంవత్సరాల వయసున్న పిల్లలతో సినిమా చేయడం గొప్ప విషయం. మంచి పాటలున్నాయి. ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్’’ అన్నారు.