నిన్న(మంగళవారం) ఉదయం రాజ్ తరుణ్ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ అల్కాపూర్ రింగ్ రోడ్ దగ్గర కార్‌తో డివైడర్‌ని ఢీకొట్టి.. తర్వాత కార్ నుండి దిగి పారిపోతూ సీసీ టివి కెమెరాలకు చిక్కడం.. ఆ న్యూస్ పలు ఛానల్స్‌లో పదే పదే ప్రసారమవుతూ.. కార్ యాక్సిడెంట్ చేసి పారిపోతున్న హీరో రాజ్ తరుణ్ అంటూ ప్రచారం చేయడం జరిగింది. తాగి డ్రైవింగ్ చెయ్యడం వల్లనే రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ తర్వాత పారిపోయాడని న్యూస్ కూడా నడిచింది. అయితే నిన్నటి నుండి అజ్ఞాతంలో ఉన్న రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ పై స్పందించాడు.
‘‘మిడ్ నైట్ కార్ నడుపుతూ నార్సింగ్ అల్కాపూర్ దగ్గర మలుపుతిప్పే క్రమంలో కారు అక్కడే డివైడర్ పక్కన ఉన్న గోడని ఢీకొట్టింది.. అయితే ఆ శబ్దానికి తన మైండ్ బ్లాంక్ అయ్యిందని, కళ్ళు కూడా బైర్లు కమ్మాయని, తన చెవులు ఆ శబ్దాన్ని తట్టుకోలేకపోయాయని.... అందుకే అలాంటి పరిస్థితిలో ఎలా ఇంటికి వెళ్లానో కూడా తనకే తెలియదని... ప్రస్తుతం తాను సేఫ్‌గా ఉన్నానని, రెస్ట్ తీసుకుంటున్నానని, తన ఆరోగ్యం, యాక్సిడెంట్ పై జరిగిన ప్రచారంతో తనకు కావాల్సిన వాళ్ళు తనకేమైందో అనే కంగారులో ఫోన్స్ చేసి పరామర్శిస్తున్నారని, తాను ప్రస్తుతం బాగున్నానని.. కొద్దిపాటి రెస్ట్ తర్వాత తిరిగి కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతానని’’ తాను చేసిన యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్ ఈ విధంగా స్పందించాడు.