మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవికిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో...
విజయ్ సేతుపతి మాట్లాడుతూ - ‘‘అమితాబ్ బచ్చన్, చిరంజీవి వంటి గొప్ప స్టార్స్‌తో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగం కావడంపై చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ - ‘‘ఇది హిస్టారికల్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైనది. సైరాలో నేను పార్ట్ కావడంపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. సైరా నరసింహారెడ్డి సినిమా చరిత్రలో మనలో చాలా మందికి తెలియని ఓ స్వాతంత్ర్యయోధుడి కథ. ఇలాంటి సినిమాలో నటించడం చాలా గర్వంగా ఆనందంగా ఉంది’’ అన్నారు.
సుదీప్ మాట్లాడుతూ - ‘‘బిగ్గెస్ట్ స్టార్ బిగ్ బి గారు ఈ సినిమాలో నటించారు. సినిమాలో స్టార్స్ సాధించిన వాటితో పోల్చితే మేం ఏం సాధించలేదు. అలాంటి వండర్ ఫుల్ యాక్టర్స్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడమే గొప్ప వరంగా భావిస్తున్నాను. ప్రతిరోజు మేం మేకప్ వేసుకుని అద్దంలో చూసుకున్నప్పుడు మేమేనా అనిపించేది. ఎందుకంటే పెద్ద పెద్దగడ్డాలు, బరువైన దుస్తులు, మేకప్ వేసుకునేవాళ్లం. యుద్ధ సన్నివేశాల్లో నటించేటప్పుడు మేం ఇతర నటీనటుల్ని కలుసుకుంటే వారెవరో తెలుసుకోవడానికే మాకు సమయం పట్టేది. చాలా గొప్ప సినిమా. ప్రతిసారి ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు కాదనకుండా చేసేయడమే’’ అన్నారు.
రవికిషన్ మాట్లాడుతూ - ‘‘నేను అఘోరిలాంటి నటుడ్ని. నేను ఎలాంటి పాత్రలో అయినా నటించగలుగతానని భావిస్తాను. సౌత్‌లో నన్ను రేసుగుర్రంతో పరిచయం చేసింది ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను తెలుగులో పరిచయం చేశారు. దక్షిణాది ప్రేక్షకుల ప్రేమను అక్కడి నుండే పొందుతూ వచ్చాను. మెగాస్టార్ చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు.
అమిత్ త్రివేది మాట్లాడుతూ - ‘‘తెలుగులో నా డెబ్యూ మూవీ. చాలా గొప్ప నటీనటులు, నిర్మాతలున్న సినిమాలో పనిచేశాను. చిరంజీవిగారు, చరణ్‌లతో కలిసి వర్క్ చేయడం మరచిపోలేని అనుభూతి. దక్షిణాది భాష అర్థం కావడమే కష్టం. అయితే సంగీతానికి భాష లేదు. దర్శకుడు, రైటర్స్ నా పనిని సులభం చేశారు’’ అన్నారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘నా వెనుక చిరంజీవిగారు, చరణ్‌గారు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేయగలిగాను’’ అన్నారు.
పర్హాన్ అక్తర్ మాట్లాడుతూ - ‘‘నేను సినిమా ప్రపంచంలోనే ఎక్కువగా బ్రతికాను. ప్రపంచంలో మంచి చిత్రాల కలెక్షన్స్ మా ఇంట్లో ఉండేవి. సినిమాలకు భాషలేదు’’ అన్నారు.
రితేష్ అద్వాని మాట్లాడుతూ - ‘‘చరిత్రలో కనపడకుండా పోయిన ఓ స్వాతంత్ర్యపోరాట యోధుడి కథ అని రామ్ నాకు సినిమా స్టోరీ లైన్ పంపాడు. ఆ పాయింట్ నాకు నచ్చింది. ఇలాంటి కథను అందరి ప్రేక్షకులకు అందించాలని ఉద్దేశంతో నేను ఈ సినిమాలో పార్ట్ అయ్యాను’’ అన్నారు.
అనీల్ టడానీ మాట్లాడుతూ - ‘‘ఇలాంటి స్కేల్, బడ్జెట్ ఉన్న సినిమాలు చేసేటప్పుడు నిర్మాతలకే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాంటి వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే’’ అన్నారు.
నిర్మాత మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ - ‘‘నాన్నగారు ఇంట్లో ఒకలా, మేకప్ వేసుకున్నప్పుడు ఒకలా ఉంటారు. ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతారు’’ అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ - ‘‘ఇది చరిత్ర మరచిపోయిన వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథ. ఇలాంటి వీరుడి కథను మన దేశంలోని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఒకటిన్నర దశాబ్దంగా సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. అందుకు కారణం బడ్జెట్ పరిమితులే. సురేందర్ రెడ్డి, చరణ్ ఈసినిమాను చేయడానికి ముందుకు రావడంతో నా కల నేరవేరింది’’ అన్నారు.
తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానం ఇచ్చారు..
1999లో అజ్‌కా గూండారాజ్ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. అందుకు కారణమేంటి?
చిరంజీవి: ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. నాకు ప్రాపర్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. ఆ కారణంగా కొంత గ్యాప్ వస్తే.. తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్లాను. అక్కడ నుండి 2016 మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. బాలీవుడ్‌కి రావాలని అనుకున్నప్పుడు ఈ సినిమా అయితే సరిపోతుందనిపించింది.
‘సైరా నరంసింహారెడ్డి’తోపాటు అదే సమయంలో ఇతర బాలీవుడ్ హీరోల సినిమాలు మరికొన్నివిడుదలవుతున్నాయి కదా! మీ అభిప్రాయమేంటి?
పర్హాన్ అక్తర్: అవును నిజమే! అయితే మనకు కావాల్సినన్నీ స్క్రీన్స్ ఉన్నాయి. సైరా ఓ గొప్ప చిత్రం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రేక్షకులు రెండు సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే రెండు వేర్వేరు సినిమాలు. అంత కంటే నేను వేరే ఆలోచనలు చేయడం లేదు.
అమితాబ్ బచ్చన్‌గారితో కలసి నటించడంపై మీ అనుభూతి ఏంటి? ఇద్దరు మెగాస్టార్స్ తెరపై కనుల విందు చేయనున్నారా?
చిరంజీవి: అమితాబ్‌గారు నా రియల్ లైఫ్ మెంటర్. నాకు తెలిసినంత వరకు ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్‌గారే. ఆయన దగ్గరకు కూడా ఎవరూ రీచ్ కాలేరు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్రకు అమితాబ్ బచ్చన్‌గారైతే బావుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అన్నారు. అదొక స్పెషల్ క్యారెక్టర్. నేను ప్రయత్నిస్తానని చెప్పి.. ఆయనకు ఫోన్ చేయగానే.. ఏం కావాలని అడిగారు. ఇలా సైరా సినిమా గురించి చెప్పాను. చరణ్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో నా గురువు పాత్రలో మీరు నటించాలని, ఓ వారం రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే చాలని అన్నాను. వెంటనే ఆయన అంగీకరించారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
భారీ చిత్రాలను హిందీ ప్రేక్షకులకు అందిస్తున్నారు కదా!.. ఇలాంటి సినిమాలనే చేయాలని ఎలా నిర్ణయించుకుంటారు?
రితేష్ అద్వాని: చరిత్రలో మరచిపోయిన స్వాతంత్ర్యయోధుడి కథను సినిమాగా చేస్తున్నామని రామ్‌చరణ్ చెప్పగానే నేను టీజర్‌ను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. మరికొన్ని భాగాలను చూశాను. బాగా నచ్చాయి. దాంతో హిందీలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నాం. భవిష్యత్‌లో కూడా మంచి సినిమాలు వస్తే.. స్క్రిప్ట్ దశ నుండే పార్ట్ అవుతాం.
‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తర్వాత ‘సైరానరసింహారెడ్డి’ వంటి మరో భారీ చిత్రంలో చేయడం ఎలా అనిపించింది?
తమన్నా: చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చిరంజీవిగారితో కలిసి నటించాలని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక నేరవేరింది. చరణ్ ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సుస్మిత చాలా కష్టపడింది. పెద్ద పెద్ద స్టార్స్‌తో నటించే అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్.
చరణ్ బాలీవుడ్‌లో ఎందుకు నటించడం లేదు?
రామ్‌చరణ్: ఎంత పెద్ద నటుడికైనా కంటెంట్ ఉన్న సినిమా కుదరాలి. వచ్చే ఏడాది రాజమౌళిగారి ఆర్ ఆర్ ఆర్ మీ ముందుకు రాబోతున్నాను. బాలీవుడ్‌లో నాకు అది కమ్ బ్యాక్ మూవీ అనుకుంటున్నాను.
మీరు చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కదా? మీరు ఎలాంటి మార్పులు గమనించారు?
చిరంజీవి: నేను 2007లో నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తర్వాత అక్కడ నుండి సినిమాల్లోకి 2016లో రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ కాలంలో సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. నేను సినిమాలు చేసేటప్పుడు నెగిటివ్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం కనపడటం లేదు. నేను నా 150వ సినిమా చేసేటప్పుడు నాకు కొత్తగా అనిపించింది. అంతా కొత్త వాతావరణం కనపడింది. అయితే సినిమాలో కంటెంట్, సినిమాలో ఎమోషన్స్‌లో మార్పు లేదు.
అమితాబ్, చిరంజీవి వంటి స్టార్స్‌తో సినిమా చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?
సురేందర్ రెడ్డి: ఛాలెంజింగ్‌గానే అనిపించింది. అయితే అమితాబ్, చిరంజీవిగారు నాకు కంఫర్ట్ జోన్‌ను క్రియేట్ చేశారు. దాని వల్ల సినిమా చేయడం సులభమైంది.