యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై.. సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ.350కోట్లతో నిర్మితమైన ఈ భారీ చిత్రం ఆగస్ట్ 30న అభిమానుల ముందుకు వచ్చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడారు. సినీ దిగ్గజాల సమక్షంలో ‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిందని.. అది చూసిన తర్వాత ప్రభాస్ గురించి మాట్లాడాలని ఈ వీడియోలో మీ ముందుకొస్తున్నట్లు తెలిపారు.
‘ఈశ్వర్’ సినిమా చేసే సమయంలో ప్రభాస్ చిన్న కుర్రాడిలా ఉండేవాడు. అలాంటి ఈశ్వర్.. ఈ రోజున ఆ ఈశ్వరుడు వుండే హిమాలయమంతా ఎత్తుకు ఎదగడం నాకు చాలా ఆనందంగా వుంది. మొదటి నుంచీ కూడా డిటెక్టివ్ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ‘సాహో’ కూడా ఒక డిటెక్టివ్ స్టోరీనే అని తెలుస్తోంది. ఒక డిటెక్టివ్ కథపై ఇన్ని వందల కోట్లు పెట్టడం నిజంగా సాహసమే. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకును ముట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే ‘సాహో’ ఎలా ఉంటుందనేది ట్రైలర్ చెప్పేస్తోంది. ‘సాహో’ .. ‘ఓహో’ అనిపించేలా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ప్రభాస్‌తో పాటు యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పరుచూరి తన వీడియోలో తెలిపారు. అయితే పరుచూరి వీడియోకు సాహో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.