మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా’. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్-02న విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇటీవలే ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియో, పవన్ వాయిస్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఇప్పటి వరకూ పవన్ ఒక్కడే వాయిస్ అందించారని మాత్రమే మనకు తెలుసు.. అయితే చిరు సినిమా కోసం మరో ఇద్దరు స్టార్ హీరోలు సైతం చెమటోడ్చారు! తమిళ, మళయాల ఇండస్ట్రీలలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న.. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్‌లు సైతం స్వరాన్ని అరువు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఇద్దరు స్టార్స్ చిరుకు మంచి ఆప్తులన్న విషయం విదితమే. దర్శకనిర్మాతలు సైరాకు మీ వాయిస్ ఇవ్వాలని సంప్రదించగానే మారుమాట చెప్పుకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి డేట్స్ అడిగి వాయిస్ ఇచ్చేశారని సమాచారం.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తుండటం.. సోదరుడు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తుండటం.. ఆయనతో పాటు మరో ఇద్దరు స్టార్స్ గొంతు కలపడం అంటే మామూలు విషయం కాదు.. ఇంత మంది కలయికతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా తియ్యటి శుభవార్తే కాదు.. పండుగే పండుగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.