టాలీవుడ్ జూనియర్, సీనియర్ హీరోలంతా హిట్టిచ్చిన డైరెక్టర్లను మరిచిపోతున్నారు. హిట్ వచ్చిన తర్వాత ఇంకేముందిలే అంతా అయిపోయింది కదా అని అనుకుంటారేమో గానీ.. ఆ డైరెక్టర్ పేరు తర్వాత పలకాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు ఎందుకో మరి. ఇప్పటికే మహేశ్ బాబు.. తనకు సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ‘పోకిరి’ సినిమాతో సూపర్ స్టార్‌ను చేసిన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరును ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మిస్సయినప్పుడు నానా రచ్చ జరిగింది. అయితే తాజాగా టాలీవుడ్‌లో మరో రచ్చ మొదలైంది.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు రాసిన అద్భుతమైన చిత్రాల్లో ‘మన్మథుడు’ ఒకటన్న విషయం విదితమే. ఈ చిత్రం నాగ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాటి నుంచి నాగ్ టాలీవుడ్ మన్మథుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. అయితే తాజాగా నాగ్ నటించిన ‘మన్మథుడు 2’ ఆగస్ట్-09న రాబోతుండటంతో ప్రమోషన్స్ షురు చేశారు. ఈ క్రమంలో నాగ్ చేసిన చిన్నపాటి పొరపాటుకు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్ భాగంగా నాగ్ ‘మన్మథుడు’ గురించి మాట్లాడారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడు విజయ్ భాస్కర్‌దే అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం గమనార్హం.
అంతేకాదు.. ఒకానొక సందర్భంలో యాంకర్ ఎంత గుర్తు చేసినప్పటికీ నాగ్ త్రివిక్రమ్ పేరు చెప్పనేలేదు. మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కరేనని.. ఆయనే రోజూ తనని కలిసి ‘మన్మథుడు’ స్క్రిప్ట్ గురించి చెప్పేవారన్నారు. అంతటితో ఆగని ఆయన ‘మన్మథుడు’ సినిమా అనగానే విజయ్ భాస్కరే తనకు గుర్తొస్తారని చెప్పడం గమనార్హం. దీంతో ఓ వైపు నాగ్ అభిమానులు, మరోవైపు త్రివిక్రమ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగ్‌కు-త్రివిక్రమ్‌కు మధ్య చెడిందా లేకుంటే ఆయన పేరు మరిచిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది.