మంచి మంచి థ్రిల్లర్ మూవీస్ తో హీరోగా ఆకట్టుకుంటున్న అడవి శేష్ తాజా చిత్రం ఎవరు. రెజినా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వెంకట్ రామ్‌జీ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎవరు సినిమా మీద ఇండస్ట్రీలోనే కాదు... ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. గూఢచారి వంటి సస్పెన్సు థ్రిల్లర్ తో హిట్ కొట్టిన అడవి శేష్ ఎవరుతో కూడా హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. మంచి కంటెంటున్న కథలతో అందరిలో ఆసక్తి రేపుతున్న శేష్ హీరోగా నటించిన ఎవరు ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అడవిశేష్ గూఢచారి సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఎవరు టీజర్ ని సమంతతో ఓపెన్ చేయిస్తే... ఇప్పుడు ఎవరు ట్రైలర్ ని నానితో విడుదల చేయించాడు.
రేప్, మర్డర్, ఇన్వెస్టిగేషన్ అనే మూడు పాయింట్స్ చుట్టూ తిరిగే కథ ఎవరు అనేది ఎవరు ట్రైలర్ లో రివీల్ చేసేసారు. సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. రెజినా తనని బలవంతం చేయబోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేసి తనకి రేప్ జరిగిందని ఇన్వెస్టిగేషన్ చెయ్యడానికొచ్చిన శేష్ ముందు చెప్పడం, అడవి శేష్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా లంచాలు తీసుకోవడం, ఇక మరో హీరో నవీన్ చంద్ర పాత్ర కాస్త మిస్టరీస్ గా కనిపించడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది.
ఇక ఇలాంటి సూపెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పొయ్యాలని చెప్పినట్లుగా శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎవరు సస్పెన్సు సీన్స్ ని హైలెట్ చేసింది. వంశీ పచ్చిపులుసు కెమెరాతనం కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. మరి గత ఏడాది ఆగష్టులో గూఢచారితో బంపర్ హిట్టుకొట్టిన శేష్ ఈసారి ఆగష్టులోను ఎవరుతో హిట్టుకొట్టేసినట్లే కనబడుతుంది.