శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడు శర్వానంద్, నాయిక కల్యాణి ప్రియదర్శినిలతోపాటు రణరంగం చిత్రంలోని ఇతర నటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు ఈ ఫంక్షన్‌లో పాల్గొనడం జరిగింది.
‘‘సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్ చూడగానే అలా అనిపించింది’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. కాకినాడలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను. ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్ అనే వ్యక్తి ద్వారా శర్వానంద్ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్ 40 ఏజ్ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను. సుధీర్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఒకడు. శర్వా కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు తెలుసు. సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. శర్వా, కల్యాణి కెమిస్ట్రీ బాగుంది. సుధీర్ ప్రేమకథలూ తీయొచ్చు అనిపించింది. ‘ప్రస్థానం’లో చిన్న వయసులోనే బరువైన పాత్ర పోషించాడు శర్వా. ‘రణరంగం’లోనూ అలాంటి అవకాశమే వచ్చింది. ఛాయాగ్రహణం, సంగీతం బాగా కుదిరాయ’’న్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది. కల్యాణి చెప్పినట్లు సుధీర్ లవ్‌స్టోరీస్ కూడా తీయొచ్చు. సినిమా విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడలో ఈ చిత్ర షూటింగ్ కోసం వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం సంతోషంగా ఉంది. కెమెరామెన్ దివాకర్ వర్క్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేను త్రివిక్రమ్‌గారికి ఫ్యాన్‌ని. ఆయన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యడం ఆనందంగా ఉంది. శర్వాతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి. ఈ సందర్భంగా ‘‘కాకినాడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సుధీర్‌గారి గత సినిమాలు గమనిస్తే గన్స్, బ్లడ్‌లతో కొన్ని వయలెన్స్ అంశాలు ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత క్యూట్ లవ్ స్టోరీస్ కూడా ఆయన తీయగలరని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నాకు గన్ పట్టుకోవడం నేర్పించారు. కెమెరామెన్ దివాకర్ అందమైన విజువల్స్ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని కల్యాణి ప్రియదర్శన్ చెప్పింది
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. ‘‘సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. శర్వా ఈ సినిమాను మంచి ఎనర్జీతో చేసాడు. త్రివిక్రమ్ గారికి థాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. నేను చెప్పదలుచుకున్న విషయాలు సినిమాలో చెప్పాను. రణరంగం మీ అందరిని అలరిస్తుందని భావిస్తున్నాను..’’అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ..‘‘ట్రైలర్‌ను లాంచ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. నేను సినిమాల్లోకి రావడానికి క్యారెక్టర్ల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పుడు ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్. ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాల్లో క్యారెక్టర్ ఇవ్వండి సార్’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో... ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా ట్రైలర్ ఆడియన్స్‌కు నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు. ఈ సినిమా కోసం కాకినాడలో కొన్ని రోజులు షూటింగ్ చేశాం. ఇక్కడే ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ రోజు మర్చిపోలేని రోజు. ఉదయం విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌గారిని కలిశాను. పరిశ్రమకు రాకముందు.. పవన్ గారి షూటింగులకు వెళ్లేవాణ్ని. అది గుర్తుపెట్టుకుని ‘శర్వా ఎలా ఉన్నావ్?’ అని అడిగారు. సినిమా గురించిన విశేషాలు పంచుకున్నాను. ‘రణరంగం’ ఈనెల 15న థియేటర్లోకి వస్తోంది. ఆదరించండి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలోచిత్ర సమర్పకులు పీడీవీ ప్రసాద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్, రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై, ఛాయాగ్రహణం: దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు: వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ