ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ప్రముఖ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. నటుడు రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ యాంకర్ సుమకి మామగారైన దేవదాస్ కనకాల అనేక సినిమాల్లో నటించి గుర్తింపు పొందడమే కాదు... ఆయన హైదరాబాద్‌లో యాక్టింగ్ స్కూల్ కూడా నడిపారు. దేవదాస్ కనకాల యాక్టింగ్ స్కూల్‌లో అనేకమంది స్టార్ హీరోస్ నటనలో శిక్షణ పొందారు. అందులో రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి వారు కూడా ఉన్నారు. ఇక అమృతం సీరియల్‌లో కూడా దేవదాస్ నటించారు. దేవదాస్ కనకాల భార్య గత ఏడాది మరణించారు. ఆవిడ మరణం దేవదాస్ కనకాలను బాగా క్రుంగ దీసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్ కనకాల నేటి (ఆగస్ట్ 2) సాయంత్రం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేవదాస్ కనకాల మరణం సినీపరిశ్రమకు తీరని లోటని పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.