‘రాక్షసుడు’తో మళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను.. ఇంకా మంచి సినిమాలు చేస్తూ మీ ప్రేమ, ఆశీర్వాదాలు పొందడానికి కష్టపడతాను- బెల్లంకొండ సాయిశ్రీనివాస్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ‘రైడ్’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘రాక్షసుడు’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లోజరిగింది. ‘రాక్షసుడు’ ట్రైలర్‌ను నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. తొలి టికెట్‌ను హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, నిర్మాత కొనేరు సత్యనారాయణ విడుదల చేశారు. తొలి టికెట్‌ను తలసాని సాయి యాదవ్ కొన్నారు. ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కొనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘రాక్షసన్’ సినిమాను చూశాం. అది చాలా బాగా నచ్చి తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నాం. రమేష్ వర్మగారిని డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. ఆయ డైరెక్ట్ చేసిన రైడ్ సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్‌లో టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకున్నాం. సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్‌గా జిబ్రాన్ వంటి స్టార్ టెక్నీషియన్స్ పనిచేశారు. మేకింగ్‌లో అసలు కాంప్రమైజ్ కాలేదు. రీషూట్స్ కూడా చేశాం. హవీశ్ కోసమని ఈ సినిమాను చూశాను. కానీ ఆల్‌రెడీ హవీశ్ అలాంటి జోనర్ సినిమా చేస్తుండటంతో సాయిశ్రీనివాస్ అయితే సరిపోతాడనిపించి ఆయన్ని తీసుకున్నాం. అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు కథే మూలం. ఇలాంటి కంటెంట్ నాలుగేళ్లుగా సౌతిండియాలోనే రాలేదు. కథను బేస్ చేసుకునే టైటిల్‌ను కూడా పెట్టాం. అనుపమ చక్కగా పెర్ఫామ్ చేసింది. టీచర్ పాత్రలో నటించారు. రాజీవ్ కనకాల, కాశీవిశ్వనాథ్‌గారు.. ఇలా ఏ పాత్రలకు ఎవరూ సరిపోతారో వారినే తీసుకున్నాం. ఏ స్టూడియో సంస్థను స్థాపించి తీసిన తొలి చిత్రమిది. మంచి నటీనటులు, టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం’’ అన్నారు.
బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ.. ‘‘సాయి శ్రీనివాస్ 7వ సినిమా. మా అల్లుడు శీనులో సాయిశ్రీనివాస్ ఎలా ఆకట్టుకున్నాడో ఈ సినిమాలో అలాగే నటించి ఆకట్టుకుంటాడు. తొలి సినిమా అల్లుడుశీనుతోనే ఏ ఇతర హీరోల సినిమాలకు తీసిపోని విధంగా రికార్డు కలెక్షన్స్‌ను ఆరోజు సాధించాడు. ఒక నిర్మాత కొడుకుగా కాకుండా, సొంత టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కొన్ని సినిమాలు తెలిసో తెలియక తప్పులు చేశాం. ఇకపై ఆ తప్పులు చేయకూడదని, అభిమానులను డిజప్పాయింట్ చేయకూడదనిపించి ఇంత వరకు మరో సినిమాను కూడా కమిట్ కాకుండా రాక్షసుడు సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఇకపై ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో అలాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లోనే శ్రీనివాస్ నటిస్తాడు. సత్యనారాయణగారు తొలి సినిమానే అయినా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. మా అబ్బాయికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. అనుపమ మంచి సినిమాలు చేస్తూ ఉంది. ఆమెకు అభినందనలు. కెమెరామెన్ వెంకట్, రమేశ్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుంది’’ అన్నారు.
అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘‘ఈసారి గట్టిగా కొడుతున్నాం. సినిమా చూశాను. ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ ఏడాది బెస్ట్ హిట్ మూవీస్‌లో సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఉంటుంది. వందశాతం గట్టిగా కొడుతున్నాం’’ అన్నారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘నాకు బెల్లంకొండ సురేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. నన్ను ఆయనే దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నారు కానీ.. నేను సిద్ధంగా లేకపోవడంతో కుదరలేదు. ఆయనంటే ఎప్పుడూ నాకు అభిమానమే. సాయిని చిన్నప్పట్నుంచి చూస్తున్నా.. హీరోగా ఎదగడానికి ప్రతి సినిమాకు కొత్తదనాన్ని ప్రయత్నిస్తూ ఈస్థాయికి చేరుకున్నాడు. రాక్షసుడు తన 7వ సినిమా. ఇది ఆల్ రెడీ తమిళ్‌లో ప్రూవ్ అయిన సినిమా. ఈ సినిమాతో రమేశ్ వర్మ సక్సెస్ రైడ్ మళ్లీ మొదలు కావాలని కోరుకుంటున్నాను. తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. అనుపమకు ఆల్ ది బెస్ట్. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
మల్టీ డైమన్షన్ వాసు మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో ఇదొకటి అవుతుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంత కష్టపడుతున్నారో చూశాను. సాయికి ఇది బెస్ట్ ఫిలిమ్ అవుతుంది. తమిళ వెర్షన్ కంటే తెలుగులో మంచి ఔట్‌పుట్ అవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. సత్యనారాయణగారి రూపంలో ఓ మంచి నిర్మాత తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు..’’ అన్నారు.
తలసాని సాయి యాదవ్ మాట్లాడుతూ.. ‘‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు, నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఈ మంచి హ్యాండ్‌సమ్ హీరో రాక్షసుడు అనే టైటిల్ పెట్టుకుని వస్తున్నాడేంట్రా? అని చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చింది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రమేశ్ వర్మ పెన్మత్స మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణలకు థ్యాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ‘‘రాక్షసుడు సినిమా రీమేక్‌లో నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి, హవీష్‌గారికి థ్యాంక్స్. రమేశ్‌వర్మగారు నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. వెంకట్‌గారు ప్రతి సీన్‌ను అందంగా చూపించారు. సాగర్‌గారు చక్కటి సంభాషణలను అందించారు. బెల్లంకొండ శ్రీనివాస్ స్వీట్ హార్ట్ పర్సన్. ఆయన కెరీర్‌కు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘అల్లుడు శీను ఐదేళ్ల క్రితం విడుదలైంది. అభిమానుల ప్రేమ, సపోర్ట్‌తోనే ఇంత దూరం రాగలిగాను. రాక్షసుడు సినిమా విషయానికి వస్తే.. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా. ఎక్స్‌ట్రార్డినరీ థ్రిల్లర్. ఎగ్జయిట్‌మెంట్ థ్రిల్లర్. అరుదుగా దొరికే స్క్రిప్ట్. ఇంత మంచి స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సత్యనారాయణగారు నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆయనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. రమేశ్‌గారు కష్టపడి, ఇష్టపడి ప్రతి ఫ్రేమ్‌ను చూశారు. వెంకట్ ప్రతి సీన్‌ను రిచ్‌గా చూపించాడు. సాగర్ ఈ సినిమాతో డైలాగ్ రైటర్‌గా పరిచయం అవుతున్నాడు. అభిషేక్ నామాగారు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. డైరెక్షన్ టీమ్ సహా అందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా కష్టపడి చేశారు. క్రిస్టోపర్ అనే యాక్టరే రాక్షసుడు. కంటెంటే ఈ సినిమాకు హీరో. అందుకనే ‘రాక్షసుడు’ అనే టైటిల్ పెట్టాం. అనుపమ స్వీటెస్ట్ కోస్టార్. తను అమేజింగ్‌గా నటించింది. ఇంకా మీ ప్రేమ, ఆదరణ పొందడానికి ఇంకా కష్టపడతాను. చిన్న చిన్న తప్పులు చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్యూర్ కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి నుండి నా కొత్త కెరీర్ స్టార్ట్ అయ్యింది. రాక్షసుడు నా మొదటి సినిమా. రెండో సినిమా కోసం వెయిట్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు థ్యాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సాగర్, రాజీవ్ కనకాల, బెక్కం వేణుగోపాల్, నల్లమలుపు బుజ్జి, మాదాల రవి, సినిమాటోగ్రాఫర్ వెంకట్, ఎడిటర్ అమర్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.