ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫీవర్ మొదలుకుని నేటి వరకూ వైసీపీలోకి వలసలు మాత్రం తగ్గట్లేదు. పదవులుంటే రాజీనామా చేసి కండువాలు కప్పుకోవడం.. ఏ పార్టీకి చెందని వ్యక్తయితే ఇక డైరెక్ట్‌గా కండువా కప్పేయడమే.. ఇదీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫార్ములా. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కండువాలు కప్పేసుకోగా.. మరికొందరు ఫ్యాన్ కిందికి వెళ్లి గాలి పీల్చుకుందామనే యోచనలో ఉన్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. సీనియర్ నటి కమ్ కమెడియన్ హేమ. ఇటీవలే బిగ్‌బాస్-3 షో నుంచి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం విదితమే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మున్ముంథు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానని చెబుతోంది. అంతేకాదు ఏ పార్టీలో చేరాలో అనేదానిపై కూడా దాదాపు క్లారిటీకి వచ్చేసిందట.
‘నాకు వైసీపీ అన్నా.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే చాలా ఇష్టం. ఎన్నికల సమయంలో పార్టీకి ప్రచారం చేయకపోయినా.. పార్టీలో చేరకపోయినా.. జగన్ అంటే నాకు ఇష్టం. నేను ప్రస్తుతం మానసికంగా బలంగా తయారు కావాలి. అప్పుడే దేన్నైనా ఎదుర్కోగలను. ఆ తర్వాతే నేనే పార్టీలోకి వెళ్తాను. ఒక్కసారి ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనక్కి రాకూడదని గట్టిగా ఫిక్సయ్యాను. ఇంటి బాధ్యతల్ని నా కుమార్తెకు అప్పగించిన తర్వాత.. పర్మినెంట్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను’ అని హేమ చెప్పుకొచ్చింది. మొత్తానికి చూస్తే వైసీపీ తీర్థం పుచ్చుకునే యోచనలో ఉన్నానని హేమ తన మనసులోని మాటను బయటపెట్టిందన్న మాట.