థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మీడియా ముందుకొస్తే చాలు సినీ ఇండస్ట్రీపై ఏం మాట్లాడుతారో ఏమో..? అందరూ ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో రాణిస్తున్న పృథ్వీ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత డోస్ పెంచేశారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ ఎందుకు పట్టించుకోవట్లేదు?.. జగన్ టాలీవుడ్‌కు అక్కర్లేదా..? అని కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా.. మరోసారి ఉన్నట్టుండి బాంబు పేల్చారు. టాలీవుడ్ సినీ పెద్దలకు వైఎస్ జగన్ ఏపీకి సీఎం కావడం ఇష్టం లేదని పృథ్వీ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. సినిమా వాళ్లకు ఓట్లు వేయవద్దని చెప్పుకొచ్చారు. వైసీపీకి ప్రచారం చేస్తే సినిమా ఛాన్స్‌లు రావని కొందరు తనతో అన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే సినిమాల్లో ఎవరో అవకాశం కలిపిస్తారని ట్రంక్ పెట్టెతో హైదరాబాద్‌కు రాలేదని.. టాలెంట్‌తో వచ్చానన్నట్లుగా పృథ్వీ తెలిపారు.
రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన.. మరో 30 ఏళ్లపాటు అమరావతి గడ్డపై వైసీపీ జెండానే ఎగురుతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలా.. ఎస్పీబీసీ ఛానల్‌కు కూడా పేరు తెస్తానని చెప్పారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఇండస్ట్రీపై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంతవరకూ టాలీవుడ్ పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ అయిన సందర్భాల్లేవ్. తాజాగా మరోసారి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన షాకింగ్ కామెంట్స్‌పై అయినా రియాక్ట్ అవుతారో లేకుంటే మిన్నకుండిపోతారో అన్నది తెలియాల్సి ఉంది.