తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కె తారక రామారావు ఇచ్చిన పిలుపు మేరకు మనం సైతం సంస్థ ముందుకొచ్చింది. చిరునవ్వును కానుకగా ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాన్ని చేపట్టింది. మనం సైతం సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని, రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆపన్నులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి పేదలకు పంచారు. ఈ కార్యక్రమంలో నటులు నరేష్, రాజకీయ నేత గట్టు రామచంద్రరావు, చిత్రపురి కాలనీ అసోసియేషన్ నాయకులు వల్లభనేని అనిల్ కుమార్, బందరు బాబీ, వినోద్ బాలా, ఆదాయపన్ను శాఖ అధికారి సాయి ప్రసాద్, టీన్యూస్ పీవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, మదన్ మోహన్ రెడ్డి, డాడీ శ్రీనివాస్ లకు చెక్ లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరేష్ మాట్లాడుతూ... మన దేశంలో యువశక్తి వెలుగుతోంది. ఇలాంటి యువతను నడిపించేందుకు సత్తా గల యువ నాయకులు కావాలి. అలాంటి శక్తివంతమైన నాయకుడే కేటీఆర్. పరిపాలనలో ఆయన పట్టుదల మనకు తెలుసు. ఆయన కార్యదక్షతను కొన్ని సందర్భాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. తెలంగాణ ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా జీవిస్తున్నారంటే దానికి కేటీఆర్ లాంటి గొప్ప నాయకులే కారణం. చిత్ర పరిశ్రమకూ ఎంతో అండదండగా ప్రభుత్వం నిలుస్తోంది. గిఫ్ట్ ఏ స్మైల్ అనే కేటీఆర్ పిలుపు అందుకుని మనం సైతం కాదంబరి కిరణ్ ఇంత చక్కటి సేవా కార్యక్రమం నిర్వహించారు. కాదంబరికి నా శుభాకాంక్షలు.. అన్నారు.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ పేదలకు సేవ చేయాలనే బలమైన సంకల్పం ఉంది. అదే స్థిరమైన లక్ష్యంతో సేవా కార్యక్రమాలూ చేస్తూ వెళ్తున్నాం. ఇవాళ కేటీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చెప్పినట్లు గిఫ్ట్ ఏ స్మైల్ సవాలు తీసుకుని ఐదుగురికి సాయం చేస్తున్నాం. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన పుట్టిన రోజున ప్రత్యేక గీతాన్ని తయారు చేశాం. నేను ఏ కార్యక్రమం చేసినా కేటీఆర్ గారికి చెప్పకుండా చేయను, అలాగే తలసాని గారికి తప్పక చెబుతుంటాను. చిత్రపురి కాలనీలో చాలామందికి అనేక రకాల సహాయాలు అందించాం. ఆ దేవుడి దయ ఉంటే భవిష్యత్ లో మనం సైతం ఉచిత పాఠశాల, మనం సైతం ఉచిత వృద్ధాశ్రమం, మనం సైతం ఉచిత వైద్యశాల నిర్మించాలని ఉంది. పేదలకు ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మనం సైతం ఉంటుంది. కాదంబరి కిరణ్ ఉంటాడు. అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ వాసులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.