అవును మీరు వింటున్నది నిజమే అభిమానులే కాదు.. పలువురు నిర్మాతలు, డైరెక్టర్స్, రచయితలు సైతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంతేకాదు.. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అని సలహాలు సైతం ఇస్తున్నారు. తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన యూ ట్యూబ్ చానెల్ ‘పరుచూరి పలుకులు’లో పవన్ గురించి మాట్లాడారు.
పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలు వచ్చేవరకూ మేకప్‌కి దూరంగా ఉండొద్దని.. రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేయాలని పరుచూరి ఒకింత సూచన చేశారు. అంతేకాదు.. పవన్ ఏమైనా చెప్పదలుచుకుంటే అది సినిమాల ద్వారా అభిమానులు, సినీ ప్రియులు, ప్రజలకు చెప్పవచ్చు .. ప్రభావితం చేయొచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
పవన్.. దివంగత ముఖ్యమంత్రి ఎమ్జీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పరుచూరి సూచించారు. ఎమ్జీఆర్ ఒక వైపున రాజకీయ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తూ వచ్చారన్న విషయాన్ని ఆయన ఉదహరించారు. అంతేకాదు.. ఒక సాధారణ వ్యక్తి ఇంటింటికీ తిరిగి చెప్పే ఒక మాటను.. ఒక ఆర్టిస్ట్‌గా సినిమాలో చెబితే సరిపోతుందని.. సామాజిక సమస్యలపై స్పందించే కథాంశాలను ఎంచుకుని, ప్రజలను ఉత్తేజపరుస్తూ వెళితే బాగుంటుందని పరుచూరి చెప్పుకొచ్చారు. మరి పరచూరి బ్రదర్ వ్యాఖ్యలకు పవన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.