సంపాదించుకున్న పేరు కంటే గొప్ప దర్శకుడు.. గురువుకు తగిన శిష్యుడు!
తెలుగు చిత్రసీమలో గురువుకు తగ్గ శిష్యునిగా పేరు తెచ్చుకుని శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఒకే ఒక్కరు. ఆయన.. కోడి రామకృష్ణ! దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రియ శిష్యుడు. అవును. ఆయన ఎన్ని రకాల సినిమాలు తీశారు! ఎన్ని విజయాలు సాధించారు! కుటుంబ కథా చిత్రాలు.. యాక్షన్ సినిమాలు.. హాస్యభరిత చిత్రాలు.. అభ్యుదయ సినిమాలు.. ఫాంటసీ మూవీలు.. ఎన్నెన్ని తీశారు! గ్రాఫిక్స్ ని ఉపయోగించుకుంటూ ఆయన రూపొందించిన సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయి!! నిస్సందేహంగా ఆయన విలక్షణత్వం మూర్తీభవించిన దర్శక దిగ్గజం. నిజానికి ఆయన సంపాదించుకున్న పేరుకంటే ఆయన గొప్ప స్థాయి దర్శకుడు. తన గురువు వెళ్లిపోయిన రెండేళ్లలోపే ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో కానరాని తీరాలకు వెళ్లిపోయి టాలీవుడ్ కి తీరని లోటు మిగిల్చారు రామకృష్ణ.
జూలై 23 ఆయన జయంతి.
1949 జూలై 23న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ 1974లో చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టారు. 1981లో ప్రతాప ఆర్ట్స్ అధినేత కె. రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడయ్యారు. సందర్భవశాత్తూ దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’ నిర్మాత రాఘవే. నిజానికి రామకృష్ణ ‘తరంగిణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. అయితే చిరంజీవి కాల్షీట్లు ఇవ్వడంతో రాఘవ ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో రామకృష్ణను దర్శకునిగా పరిచయం చేశారు. ఆ తర్వాత ‘తరంగిణి’కి దర్శకత్వం వహించిన రామకృష్ణ, మూడో సినిమా ‘ఆలయ శిఖరం’ను చిరంజీవితోటే రూపొందించారు. ఆ తర్వాత ఆయన శతాధిక చిత్రాలు తీసిన దర్శకుడిగా ఎప్పుడూ ఆకలితోటే ఉండేవారు. మరిన్ని చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని రంజింపజేయాలని ప్రయత్నిస్తూనే వచ్చారు.
ఆయన సినిమాల్లోని సెంటిమెంట్ ను బాగా పండించేది స్త్రీ పాత్రలే. తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లోనే ‘అప్పటి సీత నుంచి ఇప్పటి సీత దాకా ఆడది ఆడదే. సంసారాన్ని బాగు చేసుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంది’ అని సంగీత పాత్రతో చెప్పించారు రామకృష్ణ. ‘భారత్ బంద్’, ‘పోలీస్ లాకప్’, ‘అరుంధతి’ వంటి సినిమాల్లో హీరోయిన్ కేరెక్టర్లను శక్తిమంతంగా మలచారు. ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో నాయిక పాత్రలకు ప్రాముఖ్యం కనిపిస్తుంది.
‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, తలంబ్రాలు, ఆహుతి, ముద్దుల మావయ్య, అంకుశం, భారత్ బంద్, పెళ్లాం చెబితే వినాలి, పోలీస్ లాకప్, అమ్మోరు, పెళ్లి, పుట్టింటికిరా చెల్లి, అరుంధతి’ వంటి చిత్రాలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి.
ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం.. కన్నడంలో వచ్చిన ‘నాగరహవు’ (2016). ఇది ఆయన తొలి కన్నడ చిత్రం. దివంగత కన్నడ అగ్ర నటుడు విష్ణువర్ధన్ పాత్రను డిజిటల్ గా సృష్టించి, ఈ సినిమా రూపొందించి రికార్డ్ సృష్టించారు రామకృష్ణ. తెలుగులో ఈ సినిమా ‘నాగాభరణం’ పేరుతో విడుదలైంది. కాగా ఆయన మొదలు పెట్టిన రెండు సినిమాలు పూర్తి కాకుండా ఆగిపోవడం విచారకరం. ఒకటి.. అర్జున్, లక్ష్మీ రాయ్ జంటగా మొదలుపెట్టిన ‘రాణీ రాణెమ్మ’ కాగా, మరొకటి పుట్టపర్తి సాయిబాబాపై సినిమా. వీటిలో ‘రాణీ రాణెమ్మ’ దాదాపు పూర్తయ్యాక ఆగిపోతే, సత్య సాయిబాబాపై సినిమా సగం తీశాక ఆగిపోయింది. అందులో సత్యసాయిగా మలయాళ నటుడు దిలీప్ నటించారు.
ఇవి కాకుండా ‘అంకుల్ ఆంజనేయులు, చింతచెట్టు’ అనే సినిమాల్ని ఆయన తియ్యాలనుకున్నారు. వీటిలో ‘అంకుల్ అంజనేయులు’ అనేది ఆంజనేయస్వామి, నలుగురు పిల్లలపై నడిచే కథ. ‘చింతచెట్టు’.. సస్పెన్స్, సెంటిమెంట్ మేళవించిన కథ. ప్రాణం తియ్యడానికి వచ్చిన యముడిని ఏడాది కాలం గడువు అడిగి, కుటుంబాన్ని చక్కదిద్దుకున్న ఓ యువకుడి కథ. వీటిని తీయకుండానే మన మధ్యలోంచి వెళ్లిపోయారు రామకృష్ణ.