తెలుగు బిగ్‌బాస్-3 మరో 4 రోజుల్లో మొదలు కానున్న విషయం విదితమే. ఈ షోకు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన ఈ షోను నిలిపేయాలని.. ప్రసారం చేసుకోవాల్సి వస్తే సెన్సార్ చేసుకుని ఆ తర్వాత ప్లే చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు ఈ పిటిషన్‌ను కొట్టేయడంతో బిగ్‌బాస్‌కు ఊరట లభించింది. దీంతో యదావిధిగా అనుకున్న టైమ్‌కే ప్రారంభం కానుంది.
అయితే ఈ షోపై పిటిషన్ వేసిన ప్రముఖ దర్శకుడు కమ్ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరెడ్డికి.. ఓయూ విద్యార్థులు కూడా మద్దతు పలికారు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న విద్యార్థులు షోను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థులు షో జరిగే స్టూడియో.. నాగార్జున ఇంటిపై దాడులు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ నిర్వాహక కార్యాలయం చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైతే మరింత భద్రతను పెంచడానికి కూడా హైదరాబాద్ పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే విద్యార్థి సంఘాలు మున్ముంథు ఏం చేయబోతున్నాయ్..? అసలు ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా లేదా అనేది తెలియాలంటే జులై 21వరకు వేచి చూడాల్సిందే మరి.