శివ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘మాస్ పవర్’. ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో 50 రోజుల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ దర్శకులు సాగర్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్ చిత్ర యూనిట్ కు యాభై రోజుల షీల్డ్స్ అందజేశారు.
అనంతరం సీనియర్ దర్శకులు సాగర్ మాట్లాడుతూ... ‘‘పెద్ద సినిమాలే యాభై రోజులు ఆడటం గగనమవుతోన్న రోజుల్లో ఒక చిన్న సినిమా యాభై రోజుల వేడుక జరుపుకోవడం గొప్ప విషయం. ‘మాస్ పవర్’ అంటే ఏంటో మరోసారి ఈ సినిమా నిరూపించింది. జొన్నలగడ్డకు మరియు యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు’’ అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘‘ఏదైనా చేయగల సమర్థుడు శివ జొన్నలగడ్డ. సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం కష్టతరమవుతోన్న ఈ రోజుల్లో సినిమా రిలీజై యాభై రోజుల వేడుక జరుపుకుంటోందంటే సాధారణ విషయం కాదు. శివ తదుపరి సినిమాలు కూడా ఈ స్థాయిలోనే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... ‘‘శివ మల్టీటాలెంటెడ్ పర్సన్. ఏదైనా చేయగల సత్తా తనలో ఉంది. ఒక చిన్న సినిమా యాభై రోజుల వేడుక జరుపుకుంటోందంటే కచ్చితంగా చిన్న సినిమాలకు మంచి రో్జులు వచ్చనట్లే’’ అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ... ‘‘చిన్న సినిమా యాభై రోజుల వేడుక జరుపుకోవడం గొప్ప విషయం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. శివ ‘పోలీస్ పవర్’, ‘మాస్ పవర్’, ‘సూపర్ పవర్’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తన పవర్ ఏంటో ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇక మీదట తను చేసే ప్రతి సినిమా ఇలాగే యాభై రోజుల వేడుక జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు, నిర్మాత, హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ... ‘‘నేను గతంలో చేసిన ‘పోలీస్ పవర్’ చిత్రం తర్వాత ‘మాస్ పవర్’ చిత్రాన్ని కూడా 50 రోజులు ఆడించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు. డిస్ట్రిబ్యూటర్ రాజేంద్రగారు చిన్న సినిమాలకు దేవుడులాంటివారు. మా సినిమాను వారే రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ అవడానికి కారణమయ్యారు. అలాగే మా చిత్ర యూనిట్ సహాయ సహకారాలు కూడా మరువలేనివి. నేను చేయబోయే తదుపరి చిత్రం ‘సూపర్ పవర్’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియా అగస్టిన్, మోహన్ వడ్లపట్ల , చిత్ర యూనిట్ పాల్గొన్నారు.