టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఓ ఇంటివాడయ్యాడు. జూన్-19న సాగర్ తన చిన్న నాటి స్నేహితురాలు మౌనికను వివాహమాడాడు. అయితే ఈ విషయాన్ని తీరిగ్గా సోషల్ మీడియా ద్వారా దేవీ శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. కాగా రాక్‌స్టార్ తల్లిదండ్రుల పెళ్లిరోజే సాగర్-మౌనికల పెళ్లి జరగడం విశేషమని చెప్పుకోవచ్చు.
పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేసిన దేవీ శ్రీ.. రెండు మాటలు రాసుకొచ్చాడు. "నా తల్లిదండ్రుల పెళ్లి రోజే సాగర్-మౌనికల పెళ్లి జరగడం చాలా హ్యాపీగా ఉంది. వెల్‌కమ్ మౌనిక. ఈ కొత్త జంటకు మీ (అభిమానులు, పెద్దలు) ఆశీస్సులు కావాలి" అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ రెండు ఫొటోలను బట్టి చూస్తే అత్యంత సమీప బంధువులు, కొద్ది మంది మిత్రుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. మరికొందరు ఇంత ఆలస్యంగా.. తీరిగ్గా ఎందుకు చెప్పినట్లు అని ప్రశ్నిస్తున్నారు కూడా.
ఇదిలా ఉంటే.. సాగర్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు పాటలు పాడి సూపర్బ్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ‘ఆర్య’, ‘నేను లోకల్’, ‘జనతా గ్యారేజ్’, ‘బొమ్మరిల్లు’, ‘జులాయి’, ‘డీజే’ లాంటి చిత్రాల్లో ఈయన పాడిన పాటలు సినిమాకు ఊపిరిగా నిలిచాయి. ఈయన పాడిన పాటల్లో ‘నువ్వుంటే నిజమేగా సత్యం..’,‘నీటి ముళ్లై నన్ను గిల్లి..’,‘నేను పక్కా లోకల్’ ఈ పాటలు సాగర్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి.