ఘట్టమనేని ఫ్యామిలీ హీరోల్లో మహేశ్ తరువాత క్రేజ్ తెచ్చుకున్న హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ట ఫ్యాన్స్ అంతా సుధీర్ బాబుని కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. దాంతో పాటే సుధీర్ బాబు కూడా ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కుతూ హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా కెరీర్ సాగిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథాచిత్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన సుధీర్ బాబు, ఆ తరువాత చాలా సెలెక్టివ్ గా ఉంటూ వరుస హిట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణమ్మ కలిపింది ఇద్దరనీ వంటి యూత్ ఫుల్ హిట్స్ కూడా సుధీర్ బాబు ఖాతాలో ఉన్నాయి.
ఇక క్రియేటివ్ డైరెక్టర్స్ అంటూ తమకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఇంద్రగంటి, చంద్రశేఖర్ యేలేటి, కృష్ణవంశీ వంటి దర్శకులు దృష్టిని ఆకర్షించడంలో సుధీర్ బాబు సక్సెస్ అయ్యాడు. అలా ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సమ్మోహనం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసిన సుధీర్ బాబు, అదే ఊపులో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి నన్నుదోచుకుందువటే అనే చిత్రాన్ని తీసి ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఈ ఛేంజ్ సుధీర్ బాబుని నటుడిగా కూడా ఓ మెట్టు ఎదిగారనే చెప్పాలి. అలానే బాడీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న సుధీర్ బాబు, బాలీవుడ్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారు. భాగీ లో విలన్ గా నటించిన ఈ తెలుగు హీరోకి ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.
ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సుధీర్ బాబు, దాంతో పాటే తెలుగు నాట నానితో కలిసి నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు. సుధీర్ బాబులో వచ్చిన ఈ మార్పు కారణంగానే హిట్ ట్రాక్ ఎక్కడానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకులకి అయితే ఓ సాలిడ్ హీరో దొరికాడనే చెప్పాలి. మరి సుధీర్ తన కొత్త ఛేంజ్ ఓవర్ తో ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తాడో చూడాలి.