దీపాల ఆర్ట్స్ టాప్ ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. డైమెండ్ రత్నంబాబు దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిష్టి చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 5న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కథ ఉంటే మంచి డైలాగ్స్ తయారవుతాయి. అలాంటి కోవకు చెందినదే ఈ ‘బుర్రకథ’ చిత్రం. సబ్జెక్టు విషయానికి వస్తే.. ఒక మనిషికి రెండు మెదడులు ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తెలియచేసే చిత్రమే ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు దర్శకుడు డైమండ్ రత్నం. రైటర్‌గా ఉన్న తాను ఈ సినిమాతో దర్శకుడుగా మారారు. మంచి ప్రయత్నంతోనే ముందుకు వస్తున్నారు. అందుకు ఆనందపడాల్సిన విషయం. సాయికుమార్ ఎంత పెద్ద నటుడో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తను నాకు చాలా సన్నిహితుడు. ఆయన తనయుడు ఆది సాయికుమార్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా టూ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో అతని నటన చూసి ఆశ్చర్య పోయాను. మిగతా అందరూ అద్భుతంగా వారి వారి పనిని ప్రెజంట్ చేశారు. వండర్ ఫుల్ స్టోరీతో వస్తున్నారు. బుర్ర పెట్టి మా సినిమాను చూసి ఆదరించండి’’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో వస్తున్నాం. ఒక డిఫరెన్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అందరి ప్రోత్సాహంతోనే ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.. ఆదరిస్తారని ఆశిస్తూన్నాం’’ అని అన్నారు.
డైరెక్టర్ డైమెండ్ రత్నం బాబు మాట్లాడుతూ.. ‘‘ఒక బుర్రలో రెండు బ్రెయిన్స్ ఉంటే ఆ మనిషి తీరు.. ఎదుర్కొన్న సమస్యలు ఏంటని తెలిపే ఎంటర్‌టైనింగ్ సినిమా బుర్రకథ. ఎమోషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందరికీ నచ్చే చిత్రం అవుతుందని భావిస్తున్నా. సెన్సార్ వారు ఈ సినిమాను చూసి బావుందని చెప్పారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం’’ అని తెలిపారు.
సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘హిట్ సినిమాతోనే మీ ముందుకు వస్తున్నా అని డైమండ్ రత్నం నాతో చెప్పాడు అలానే సినిమాను చిత్రీకరించాడు. విజయేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి రావడం మాకంతా పాజిటివ్ వైబ్రేషన్‌ను కలిగిస్తోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా బాగొచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఇందులో ఆది నటన చాలా బాగుందని అందరూ అంటున్నారు. అందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఆది కూడా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం మీరు రేపు సినిమాలో చూస్తారు’’ అని చెప్పారు.
హీరో ఆది మాట్లాడుతూ.. ‘‘రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి నటించడం చాలా హ్యాపీగా ఉండటంతో పాటు ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం చూసి ఎంకరేజ్ చేయండి’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్, పృధ్వి రాజ్(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.