టాలీవుడ్‌లో ఈ మధ్యన సినిమాకి సూపర్ హిట్ టాక్ పడితే తప్ప ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడడం లేదు. పెద్ద హీరోల సినిమాలైతే తప్ప ప్రేక్షకులు కదలడం లేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ పడినా... ఏ అమెజాన్ ప్రైమ్ లోనో.. బుల్లితెర మీద ప్రసారం అయినప్పుడో చూడొచ్చులే అనుకుంటున్నారు తప్ప... పదో పరకో ప్రేక్షకులు మాత్రం వారం వారం విడుదలయ్యే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకు పెద్ద ఉదాహరణలు... మజిలీ, జెర్సీ సినిమాలే. మజిలీ సినిమా హిట్ టాక్ పడింది.. కానీ అనుకున్న కలెక్షన్స్ రాలేదు. ఇక జెర్సీ సినిమాకైతే సూపర్ హిట్ టాక్ పడింది కానీ.. కలెక్షన్స్ పరంగా పూర్.
మహర్షి సినిమా తర్వాత మళ్ళీ ప్రేక్షకులకు నచ్చే సినిమాల్లో జూన్ లో విడుదలైన గేమ్ ఓవర్, తర్వాతి వారం విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, నిన్నగాక మొన్న వచ్చిన బ్రోచేవారెవరురా ఉన్నాయి. అందులో గేమ్ ఓవర్ హిట్ అయినా.. అది ఒక వారానికి సర్దుకోవాల్సి వచ్చింది. కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కి సూపర్ హిట్ టాక్ పడడమే కాదు.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయ్. రెండో వారంలో కూడా ఏజెంట్ థియేటర్స్ బుకింగ్స్ తో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఇక అమెరికాలో అంచనాల్నిమించి 2.75 లక్షల డాలర్లు రాబట్టి ఈ చిత్రం ఫుల్ రన్లో 3 లక్షల డాలర్ల మార్కును అందుకున్న ఆశ్చర్యపోవక్కర్లదంటున్నారు. ఒక కొత్త హీరో, కొత్త దర్శకుడు ఇలా ఒక్క సినిమాకి సక్సెస్ అవడమే కాదు.. ఆ సినిమా కలెక్షన్స్ కూడా కళకళలాడుతున్నాయి. మరి బ్రోచేవారెవరురా సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చినా.. ఏజెంట్ థియేటర్స్ మాత్రం ఇంకా ఫుల్ అవుతున్నాయి అంటే.. ఒక చిన్న సినిమా ఎంతగా ప్రభంజనం సృష్టించిందో చెప్పుకోవచ్చు.