స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘రాజ్ ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ... ‘ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా బావ( శ్రీహరి). ఇద్దరిది 35 ఏళ్ల అనుబంధం. నాకు హైదరాబాద్ లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. శ్రీహరి నిలయం దానిపేరు. శాంతి చేతుల మీదుగా ఆ ఇల్లు ప్రారంభించింది. నిర్మాత సత్తిబాబు నాకు షాకిచ్చాడు. శ్రీహరి గారి అబ్బయితో నేను సినిమా చేయాలి? కానీ మీరేంటి అన్నా. లేదు సినిమా స్టార్ట్ అయింది చెప్పారు. మా పెద్దొడి( శ్రీహరికి పెద్ద కొడుకు) దర్శకత్వంలో చిన్నోడు హీరోగా ఓ సినిమా నిర్మిస్తా. ఎంత ఖర్చు అయినా చేస్తా అన్నారు. ఇప్పటివరకూ నేను రెండే డెత్ లు చూసా. ఎన్టీఆర్ తర్వాత. శ్రీహరి చనిపోయినప్పుడే అంత జనం వచ్చారు. 16 కిలోమీటర్ల మేర జనాలంతా నడుచుకునే వచ్చారు. ఇంటికి ఉండే అన్ని కాంపౌండ్ వాల్స్ పడిపోయాయి. అంటే మా బావ అంత అభిమానం సంపాదించుకున్నారు. తనతో జర్నీ చేసిన వారు ఎప్పటికీ మర్చిపోరు. ప్రతీ నిర్మాత బావ గురించి ఎలా మాట్లాడుకునే వారు. మేఘాంశ్ గురించి అలాగే మాట్లాడుకోవాలి. తండ్రిలా పెద్ద స్టార్ అవ్వాలి. రాజ్ ధూత్ టీమ్ లో మంచి ఫైర్ ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి’ అని అన్నారు.