టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంతూరు పాలకొల్లులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణే ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు. ఆదివారం నాడు అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్యను పరామర్శించిన పవన్.. అనంతరం పార్టీ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో జనసేన అధ్వర్యంలో పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
"తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పాలకొల్లు నుంచి ఎందరో వచ్చారు. అల్లు రామలింగయ్య గారు, దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు... ఇలా చాలామంది పాలకొల్లు నుంచి వచ్చినవారే. నవతరంలో ఉన్న నైపుణ్యాన్ని తీర్చిదిద్దేలా పాలకొల్లులో ఎస్.వి.రంగారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను జనసేన అధ్వర్యంలో నెలకొల్పనున్నాం. ఈ ఇన్స్టిట్యూట్‌కి హరిరామ జోగయ్య గారు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీరు నిర్మాతగాను ఎన్నో మంచి చిత్రాలు అందించారు. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసు నేతృత్వంలో నడుస్తుంది. ఇందుకు నా అండదండలు ఉంటాయి. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల యువతకు ఉపయోగపడేలా ఉంటుంది" అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందుకు హరిరామ జోగయ్య స్పందిస్తూ.. చిరంజీవి కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. పవన్ కల్యాణ్ అభిమానిని అని.. జనసేనకు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. చివరి శ్వాస వరకూ జనసేన కోసమే పని చేస్తానన్నారు. పాలకొల్లు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇస్తామని.. రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారన్నారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధం అయిందని.. ఈ శిక్షణాలయం ప్రారంభానికి పవన్ కల్యాణ్ వస్తారని జోగయ్య చెప్పుకొచ్చారు.