స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే మెగాభిమానుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ తరుణంలో రియల్.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
ఆదివారం సాయంత్రం.. టాలీవుడ్ హీరో, సైరా నిర్మాత రామ్ చరణ్ కార్యాలయం ముందుకు ఆందోళన చేపట్టారు. సినిమా కోసం ఉయ్యాలవాడ కథను తీసుకున్నప్పుడు కనీసం తమను కలవలేదని చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చిత్రబృందాన్ని పలు విషయాలను ప్రశ్నించగా.. మీకు హక్కు లేదని మా ప్రాపర్టీ నుండి ఖాళీ చేయండంటున్నారని ఒకింత ఆవేదనకు లోనయ్యారు. మిమ్మల్ని చరణ్ బాబు కలుస్తాడని కార్యాలయ సిబ్బంది చెప్పి అక్కడ్నుంచి పంపేశారు.
ఇందుకు స్పందించిన చిత్రబృందం.. వందేళ్లు దాటిన తర్వాత ఎవరైనా చరిత్రకారుడుకి సంబంధించిన సినిమాను తెరకెక్కించవచ్చని ఇందులో ఎలాంటి సమస్యలుండవన్నారు. ‘సైరా’కు ముందు ఉయ్యాలవాడ నరసింహరావు కుటుంబ సభ్యులతో మేం చర్చించామని.. వాళ్లు కూడా తమతో ఓపెన్‌గానే ఉన్నారని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అంతే తప్ప యూనిట్ ఎవర్నీ బెదిరించలేదని.. కోర్టులో ఈ వ్యవహారంపై కేసు నడుస్తున్నందున ఎక్కువ మాట్లాడకోదలుచుకోలేదని సదరు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా..? లేకుంటే మరింత ముదురుతుందా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.