తెలుగులో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. త్వరలోనే సీజన్-03 అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఓ సస్పెన్స్ ప్రోమోను రిలీజ్ చేసిన ‘మా’ యాజమాన్యం తాజాగా... మరో పూర్తి క్లారిటీతో ప్రోమోను రిలీజ్ చేసి షో లోపల కావాల్సిన సరకులన్నీ సిద్ధం చేసింది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సినిమా స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీకి అక్కినేని అభిమానులు, బిగ్ బాస్ ప్రియులు ఫిదా అయిపోయారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’షోను విజయవంతంగా నడిపి ఊహించని రీతిలో సక్సెస్ అవ్వడంతో బిగ్‌బాస్‌కు కూడా ఆయన్నే నిర్వాహకులు ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ ప్రోమోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు తినేందుకు వంటసామాగ్రి, బియ్యం, కూరగాయల కోసం నాగ్ మార్కెట్‌కి వెళ్లారు. మొత్తం సరుకులన్నీ రెడీ చేసుకుని ఇక బిగ్‌బాస్ హౌస్‌కు పయనం కాబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్కెట్ నుంచి ఇక డైరెక్టుగా హౌస్‌లో నాగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే రెండు సీజన్లు సక్సెస్ అవ్వడంతో నాగ్ ఎలా నడిపిస్తారో అనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.