2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఊహించని మెజార్టీ సీట్లు దక్కించుకుని.. టీడీపీ, జనసేన ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే లోపం ఎక్కడ జరిగింది..? పార్టీ ఎందుకు ఓడింది..? అనే పోస్టుమార్టమ్ పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమయ్యాయి. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఈ ఓటమిపై తాజాగా ప్రముఖ రచయిత ‘పరుచూరి పలుకులు’లో పరుచూరి గోపాలకృష్ణ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ఓటమిని ఎవరూ ఊహించలేదన్నారు. కొన్నేళ్లుగా జగన్ ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారని. వేల కిలోమీటర్లు నడిచి.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పారన్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తనకు తెలియదు కానీ.. జనసేన ఓడిపోవడం ఒక ఎత్తైతే, పవన్ ఓడిపోవడం మరో ఎత్తన్నారు. అసలు కలలో కూడా పవన్ ఇలా ఓడిపోతారని ఏ అభిమాని, ఆంధ్రా వాసి దీన్ని ఊహించి ఉండరని ఒకింత ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తప్పకుండా అసెంబ్లీకి వస్తాడని అందరూ అనుకున్నారని.. ప్రశ్నించే హక్కును ప్రజలకు నేర్పడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని పరుచూరి స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఈ హక్కు గురించి చెబుతున్నా ఆయన్ను అసెంబ్లీలోకి ప్రశ్నించే హక్కు కోసం పంపించకపోవడం అనేది నమ్మశక్యం కాని నిజమని.. అయినా ఆయన ఓడిపోవడం ఏమిటో?’. ఇవాళ పవన్ ఏది కోరారో.. అది రామారావు గారు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు జరిగిందని.. పవన్ ప్రజాస్వామ్యంలో ఆ మార్పు తీసుకొస్తారని పరుచూరి ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోకి వెళ్తేనే ప్రశ్నించడం కాదు ప్రజల్లోంచీ కూడా పవన్ ప్రశ్నిస్తుండాలని కోరుకుంటున్నట్లు పరుచూరి చెప్పుకొచ్చారు.