టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమాలు అయినా రాజకీయాలైనా తనదైన స్టైయిల్‌లో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు ఆర్జీవీ. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఓ కన్నేసిన ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి వాడివేడిగా సాగుతున్నాయి. శాసనసభ వేదికగా వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతలుగా పరిస్థితులు మారిపోయాయి. ఈ వ్యవహారంపై ఆర్జీవీ రియాక్ట్ అవుతూ.. ‘‘అసెంబ్లీ అంటే అరవడం, విమర్శలు చేయడం లేకపోతే ఆరోపించడం ఇదేనా..? వీటితోనే మొత్తం కాలం అంతా వృథా చేస్తున్నారు. మీ సొంత ప్రతీకారాలు, పౌరుషాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల గురించి స్పందించాలని కోరుకుంటున్నాను’’ అని ఆర్జీవీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
అంతటితో ఆగని ఆర్జీవీ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కూడా ఓ ట్వీట్ చేశారు. ‘‘అసెంబ్లీలో గంట మోగించడం తప్ప స్పీకర్ చేస్తున్న పని ఇంకేమైనా ఉందా.. స్పీకర్ గంట మోగిస్తుంటే నాకు స్కూల్ బెల్ గుర్తుకొస్తోంది. ఎందుకంటే సభలో ఎమ్మెల్యేల ప్రవర్తన స్కూల్ పిల్లలలాగానే ఉంది.. జస్ట్ ఆస్కింగ్ అంతే’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్స్‌పై నెటిజన్లు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటి వరకూ వైసీపీని ఆకాశానికెత్తేసిన ఆర్జీవీ.. ఇప్పుడు మళ్లీ విమర్శలు చేయడం మొదలెట్టేశాడుగా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.