తెలుగులో దేశవ్యాప్తంగా మంచి నిర్మాణ సంస్థల గురించి చెప్పుకోవాలంటే అందులో సురేష్ ప్రొడక్షన్స్ గురించి.. రామానాయుడు, సురేష్‌బాబుల గురించి కూడా చెప్పుకోవాలి. ఇక పరిశ్రమను మద్రాస్ నుంచి ఏపీకి తరలించే క్రమంలో వైజాగ్‌కి తరలించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల పరిశ్రమ హైదరాబాద్‌లో స్ధిరపడింది. రామానాయుడు స్టూడియో, పద్మాలయా స్టూడియో, రామకృష్ణ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ ఏడెకరాలు, నానక్‌రాం గూడ రామానాయుడు స్టూడియోలన్నీ హైదరాబాద్‌లో వెలిశాయి.
అయితే రామానాయుడు బతికున్నప్పుడు వైజాగ్‌లో స్టూడియో నిర్మించి, ఎక్కువశాతం తన చిత్రాలలోని షూటింగ్‌లను వైజాగ్‌లో జరిపించాడు. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలోని హైదరాబాద్‌లో పరిశ్రమ ఉండిపోయింది. నిన్నటిదాకా ఏపీని ఏలిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒకసారి వైజాగ్‌లో సినీ నిర్మాణం జరగాలని, మరోసారి పరిశ్రమ అమరావతికి రావాలని కన్‌ఫ్యూజ్ చేశారు తప్ప ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయాడు.
ఈ విషయంపై సురేష్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే స్టూడియోల నిర్మాణం జరగలేదేని, ఒకసారి సరైన నిర్ణయం తీసుకుంటే స్టూడియోల నిర్మాణం పెద్ద విషయం కాదని తేల్చిచెప్పాడు. ఈ విషయంలో జగన్ అయినా ఇకపై స్పందించాలని, స్పష్టమైన నిర్ణయాన్ని ఆయన ప్రకటించాలని కోరాడు. అవసరమైతే ఈ విషయంలో తాము జగన్‌ని కలుస్తామన్నాడు. ప్రభుత్వాలు ఇలా మిన్నకుండి పోతే భవిష్యత్తులో కూడా యువత సినిమాలలో పనిచేసేందుకు హైదరాబాద్‌కే రావాల్సివస్తుందని, స్ధిరమైన నిర్ణయం తర్వాత స్టూడియోల నిర్మాణం జరుపుతామని ప్రకటించాడు.
ఇక నుంచి కేవలం రామానాయుడు స్టూడియోస్ ద్వారా తెలుగు సినిమాల నిర్మాణమే కాదు.. ఇకపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తామని చెప్పాడు. వాల్ట్‌డిస్నీతో కలిసి భారీ బడ్జెట్‌తో రానా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకస్యప’ని నిర్మిస్తున్నామని సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు.