తమిళ హీరో విజయ్ అంథోని అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను నకిలీ, సలీం చిత్రాలతో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒకే ఒక్క సినిమా బిచ్చగాడు సినిమాతో విజయ్ అంథోని హీరోగా తెగ పాపులర్ అవడమే కాదు... ఆయన చిత్రాలకు తమిళ మార్కెట్ మాత్రమే కాదు.. తెలుగు మార్కెట్ కూడా కదిలింది. అయితే బిచ్చగాడు క్రేజ్‌తో తర్వాత చేసిన సినిమాలన్నీ వరసబెట్టి ప్లాప్ అయ్యాయి. విజయ్ అంథోని బిచ్చగాడు ఫేమ్‌తో తర్వాతి సినిమాలు కొన్న బయ్యర్లు గగ్గోలు పెట్టారు. మధ్యలో వచ్చిన చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అయితే తాజాగా విజయ్ కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోషగాడు అట్టర్ ప్లాప్ మూవీ తర్వాత ఇంద్రసేన కూడా ప్లాప్ అవడం తర్వాత వచ్చిన కిల్లర్ మూవీ మీద అంచనాలు లేవు. కానీ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ సస్పెన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండే కాక క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు ఆండ్రూ లూయిస్ కథ, కథనాల్ని రాసుకొన్న విధానం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే. మొదట్లో సన్నివేశాలు కాస్త గజిబిజిగా అనిపించినా... కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకుడు అందులో లీనమైపోతాడు. విజయ్ ఆంటోనీ నుంచి ఇటీవల వచ్చిన చిత్రాలతో పోలిస్తే కిల్లర్ బాగుంది. బిచ్చగాడంత హిట్ కాకపోయినా... కిల్లర్ సినిమా కూడా హిట్ అవడం ఖాయం.