మే నెలలో ఒకే ఒక్క పెద్ద సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చింది. మే 9 న మహేష్ బాబు మహర్షి సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమాకి యావరేజ్ టాకొచ్చినా.. చిత్ర బృందం మాత్రం సూపర్ హిట్ అంటూ వాయించేశారు. ఇక తర్వాత వారంలో వచ్చిన అల్లు శిరీష్ ఎబిసిడి, ఆ తర్వాత వచ్చిన సీత లాంటి సినిమాలతో ప్రేక్షకులకు పిచ్చెక్కింది. వేసవి సెలవలన్నీ చాలా చప్పగా చాలా డ్రైగా ముగిసిపోయాయి. మరో వారంలో స్కూల్స్ రీ ఓపెన్ కూడా అవుతున్నాయి. కానీ ఆయమన్న సినిమా మాత్రం బాక్సాఫీసుని షేక్ చెయ్యలేకపోతున్నాయి. ఇక ఈవారం విడుదలైన 7, హిప్పీ సినిమాలు అయితే ప్రేక్షకుల తలకు బొప్పి కట్టించాయి.
అసలు వేసవి సెలవలు అంటే గనక భారీ బడ్జెట్ సినిమాల హంగామా మామూలుగా ఉండదు. కానీ ఈవేసవిలో మహర్షి తప్ప భారీ బడ్జెట్ మూవీ ఒక్కటి లేదు. ఏదో తమిళం నుండి సూర్య ఎన్జీకే మంచి అంచనాలతో విడుదలయింది. అది కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ నెలలో కూడా పెద్ద సినిమాలేమి కనిపించడం లేదు. జూన్ మొదటి వారంలో హిప్పీ, 7 విడుదలైతే.. తర్వాత కూడా చిన్న సినిమాల హడావిడే ఉంది. అందులో మల్లేశం, గేమ్ ఓవర్, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, విశ్వామిత్ర, కిల్లర్, వజ్రకవచధర గోవింద లాంటి ఓ ఏడెనిమిది సినిమాలు ఈ జూన్ లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలంటే కేవలం సాహో, సై రా సినిమాలే కనబడుతున్నాయి. ఆ సినిమాల విడుదలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. ఈలోపు చిన్న సినిమాల హడావిడే బాక్సాఫీసు వద్ద కనబడుతుంది. ఏది ఏమైనా మేతో పాటుగా జూన్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు.