సమంత.. ఒకవైపు అక్కినేని కోడలుగా, నాగచైతన్య శ్రీమతిగా, వరుసగా తెలుగు, తమిళ చిత్రాలలో మంచి పాత్రలలో నటిస్తూ వస్తోంది. క్షణం తీరిక లేకపోయినా పర్సనల్ లైఫ్ కోసం విదేశాలలో వెకేషన్స్‌కి భర్తతో సహా వెళ్తోంది. ప్రస్తుతం ఆమె ఓ కొరియన్ సినిమా ఆధారంగా నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ చిత్రంలో అల్లరి చిల్లరి పాత్రను చేసింది. ఇక ఇటీవలే పెళ్లయిన తర్వాత తన భర్త నాగచైతన్యతో తొలిసారి ‘మజిలీ ’ చేసింది. ఇక ఈమె ఇటీవల కన్నడ ‘యూ టర్న్’ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసింది. తాజాగా సమంత ఎంత బిజీగా ఉన్నా తను నటించిన చిత్రాలతో పాటు ఇతరుల చిత్రాలు కూడా చూస్తూ ఉంటుంది. తనకి నచ్చిన వాటిని పొగిడేస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె మలయాళంలో వచ్చిన ‘ఉయారే’ చిత్రాన్ని చూసింది. చూసిన వెంటనే తనకు ఎంతో నచ్చిన ఈ చిత్రం గురించి ఉయారే.. మీరు చూడండి.. మీకు కోపం తెప్పిస్తుంది. మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ప్రేమించేలా చేస్తుంది. నమ్మకాన్ని కలిగిస్తుంది. ప్రేరణనిస్తుంది.. థ్యాంక్యూ పార్వతి... మిమ్మల్ని చూసి గర్విస్తున్నా.. డైరెక్టర్ మను.. రచయితలు బాబీ సంజయ్, టీం.. మీరు అద్భుతంగా పనిచేశారు.. అని ట్వీట్ చేసింది.
దానికి ప్రతిగా మలయాళ నటి పార్వతి సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ చిత్రంలో పైలెట్ కావాలనే ధ్యేయంతో ఉండే పాత్రలో పార్వతి నటించింది. ఆమెకి పైలెట్ ట్రైనింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తర్వాత ముంబైకి వెళ్లడానికి సిద్దపడుతుంది. ఆ సమయంలోనే విపరీతంగా ప్రవర్తించే మనస్తత్వం, పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉండే బోయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెబుతుంది. దాంతో అతను యాసిడ్ దాడి చేస్తాడు. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘ఉయారే’ కథ. మరి ఇంత మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సమంత ఏమైనా ముందుకు వస్తుందేమో చూడాల్సివుంది.