చూసే వారికి సినీ నటుల జీవితాలు అద్దాల మేడల్లాగే కనిపిస్తాయి. కానీ వారికి కూడా ఎమోషన్స్, పర్సనల్ లైఫ్ వంటివి ఉంటాయి. ఇంట్లో ఏ మూడ్‌లో ఉన్నా సరే సెట్స్‌కి వస్తే డైరెక్టర్ చెప్పిన ఎమోషన్‌ని వారు పలికించాల్సిందే. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ’ చిత్రంలో తల్లి చనిపోయిన బాధలో కూడా కమెడియన్ నవ్వులు ఎలా పూయిస్తాడు? అనేది గొప్పగా చెప్పారు. ఇక తెలుగు విషయానికి వస్తే కామెడీ హీరోగా అతి తక్కువ వ్యవధిలో 50 చిత్రాలు పూర్తి చేసి రాజేంద్రప్రసాద్ స్థానాన్ని తాను భర్తీ చేయగలనని నిరూపించుకున్న హీరో అల్లరి నరేష్. కానీ ఈమధ్య రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ సవ్యంగా సాగడం లేదు. వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన తండ్రి ఈవీవీ ఉంటే ఆయన దర్శకత్వంలోనో లేక ఆయన గైడెన్స్‌లోనో అల్లరోడికి విజయం దక్కి ఉండేది.
ఇక అల్లరోడులో మంచి నటుడు కూడా ఉన్నాడని మనకి ‘గమ్యం, శంభో శివ శంభో, ప్రాణం, నేను’ తాజాగా వచ్చిన మహేష్ ‘మహర్షి’లోని రవి పాత్రలు గుర్తు చేస్తాయి. తాజాగా అల్లరినరేష్ మాట్లాడుతూ, ఇన్నేళ్ల కెరీర్‌లో ఒకరోజు షూటింగ్‌లో మాత్రం నరక వేదన అనుభవించాను. మా నాన్నకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆస్పత్రిలో చేర్పించాం. కానీ నాన్నకి అంత సీరియస్ అని ఊహించలేకపోయాను. ఆరోజు ‘సీమ టపాకాయ్’ షూటింగ్ ఉంది.
ఆరోజు మిస్సయితే జయప్రకాష్‌రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు విదేశాలకు వెళ్తున్నారు. అంత గ్యాప్ వస్తే సినిమా విడుదలకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వెళ్లి చేశాను. నాన్నకు ఎలా ఉందో అనే బాధలో కూడా కామెడీ సీన్స్ చేయాల్సి వచ్చింది. నాన్న మరణం సమయంలో నేను పక్కన లేనే? అనే ఫీలింగ్ ఇప్పటికీ నాకు ఉంది. మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు నాన్న మరణించే సమయంలో నువ్వు పక్కన లేవురా? అంటూ ఉంటే ఏడ్చేస్తాను అని చెప్పుకొచ్చాడు.