మెగాభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అదొక పండగ రోజు అనే చెప్పాలి. ఆ రోజంతా సామాజిక కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలలో కూడా వారు బిజీబిజీగా ఉంటారు. తమ హీరోని కలవడం, ఆయన కనుచూపు కోసం పడిగాపులు కాయడం మామూలే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ రోజును తన అభిమానుల కోసం కేటాయిస్తారు. రాబోయే ఆగష్టు22 పెద్ద దూరంలో లేదు. ఆరోజున మెగాస్టార్ తన ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఇందులో చిరంజీవి సరసన నయనతార, తమన్నాలతో పాటు అనుష్క కూడా ఓ పాటలో మెరుస్తుందని సమాచారం.
అమితాబ్‌బచ్చన్, కిచ్చాసుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి భారీ తారాగణంతో ఈ మూవీ రూపొందుతోంది. ఈసారి మెగాస్టార్ బర్త్‌డే కానుకగా ఆగష్టు22న ‘సై..రా’ చిత్రం విడుదల తేదీతో పాటు టీజర్‌ని విడుదల చేస్తారని సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న ‘సై..రా’ ని విడుదల చేస్తారని భావిస్తున్నారు. వరుసగా వీకెండ్స్‌తో పాటు వెంటనే దసరా సెలవులు వస్తాయి. వీటన్నింటిని క్యాష్ చేసుకునే పనిలో ఈమూవీ ఉండనుంది. ఇక అదే రోజున ఆయన తాను నటించబోయే తదుపరి చిత్రం ప్రారంభోత్సం కూడా జరుపుతారని తెలుస్తోంది.
దాదాపు ‘సై..రా’ షూటింగ్ పూర్తి కావడంతో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంలో అపజయమే ఎరుగని సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ, చిరు చిత్రం కోసం స్క్రిప్ట్‌ని లాక్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇంత తక్కువ గ్యాప్‌లోనే చిరు తన ఫిజిక్‌ని మార్చుకుని కొరటాల శివ చిత్రం కోసం రెడీ అవుతాడట. పుట్టినరోజున ప్రారంభోత్సవం జరిపి ఓ వారం గ్యాప్‌లోనే ఆయన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాడని సమాచారం. ఇందులో చిరు ఎన్నారైగా, రైతు బాంధవునిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించనున్నాడు.