ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తుంది 2020 సంక్రాంతి కోసమే. వచ్చే ఏడాది లో ఈసారి చాలా పవర్ ఫుల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈసారి పోటీ ఒక రేంజ్ లో ఉండే అవకాశముందని తెలుస్తుంది. లేటెస్ట్ గా మహేష్ 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ లోగో ని రిలీజ్ చేసి 2020 సంక్రాంతికి వస్తున్నాం అని అధికారికంగా ప్రకటించేసారు మేకర్స్. దాంతో ఇతర స్టార్ హీరోలు తమకు ధీటైన పోటీ తప్పదనే అర్థమైంది. ఈ సంక్రాంతికి మాంచి ఉప్పు-కారం తిన్న పుంజులే దిగుతుండడంతో పోటీ రసకందాయంలో పడింది.
ఇక మహేష్ కి దీటుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘జాన్’ సంక్రాంతి బరిలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. జిల్ ఫ్రేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ చేస్తున్న ఈసినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరి కావడంతో యూత్ లోనూ అంతే క్రేజు నెలకొంది. ప్రభాస్ చిత్రం సాహో ఆగస్టు లో రిలీజ్ అవ్వుతుంటే జాన్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇక ఈ పందెంలో రేసు గుర్రం కూడా ఉంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా 2020 సంక్రాంతి రేస్ లో ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న ఈసినిమా పక్కా ఫామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం. అల్లు అర్జున్‌కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
అలానే కింగ్ నాగార్జున కూడా సంక్రాంతిపై కన్నేశారని వార్తలొచ్చాయి. అతను కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కించనున్న బంగార్రాజు సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలానే నటసింహా నందమూరి బాలకృష్ణ- కె.ఎస్.రవికుమార్ ప్రాజెక్టు సెట్స్ కెళ్లడం కొంత ఆలస్యమైనా సంక్రాంతి రేసులోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. బాలయ్య సినిమాలు ప్రతి సంక్రాంతికి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈమూవీ సంక్రాంతికి వస్తుంది. ఇక వీటితో పాటు నవతరం హీరోల్లో నాని- శర్వానంద్- నాగచైతన్య- అఖిల్ లాంటి హీరోల సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి పోటీ చాలా గట్టిగానే ఉండేటట్టు ఉంది.