ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని తెలిపాడు. అందుకు అనుగుణంగానే ఆయన ఇటీవల వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక తాను ఇంతకు ముందు చూపిన వేగం కంటే సినిమాల విషయంలో మరింత జోరు చూపిస్తున్నాడు. ‘కబాలి, కాలా, పేట, 2.0’ ఇలా వరుస చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మురగదాస్ ‘దర్బార్’ మూవీలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించగా, మురుగదాస్‌తో తొలి చిత్రం చేస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మురుగదాస్ సుపరిచితమే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి అదేనండీ పొంగల్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇదే సమయంలో రజనీ తన తదుపరి ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. కెమెరామెన్‌గా ఉంటూ దర్శకునిగా రాణించిన అతి తక్కువ మంది కమర్షియల్ డైరెక్టర్స్‌లో ఒకరైన శివ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. శివ అనగానే మనకు అజిత్ గుర్తుకు వస్తాడు. వరుసగా ఆయనతో ‘వి’ అనే అక్షరంలో ‘వీరం, వేదాలం, వివేగం, విశ్వాసం’ వంటి చిత్రాలను శివ తీశాడు. ఈయన తెలుగులో రవితేజ హీరోగా రూపొందిన ‘దరువు’ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. మొదట శివకి సూర్య నుంచి పిలుపు వచ్చింది. మొదటగా శివతో సూర్య ఓ చిత్రం చేయాలని భావించాడు.
అయితే ఎలాగూ సూర్య చేతిలో బాల చిత్రం ఉండటం, అదే సమయంలో తనకి రజనీకాంత్ నుంచి పిలుపు రావడంతో సూర్యని రిక్వెస్ట్ చేసి మరీ ఒప్పించి ప్రస్తుతం శివ, రజనీకాంత్‌కి సంబంధించిన కథా చర్చల్లో మునిగిపోయి ఉన్నాడు. మరి శివ కూడా రజనీతో చేయడం ఇదే ప్రధమం, మరి అజిత్‌ని చూపించినంత మాస్‌గా రజనీని చూపిస్తే ఇక తమిళనాడులో తిరుగే ఉండదు. అందుకే ఈ అవకాశాన్ని ఎలాగైన సద్వినియోగం చేసుకోవాలని శివ పట్టుదలతో ఉన్నాడు.