ఏపీ ఎన్నికల ముందు తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏయే పథకాల వల్ల ఘనవిజయం సాధించిందో దాదాపు అవే పథకాలను టిడిపి అధ్యక్షుడు, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాస్త పేర్లుమార్చి అమలు చేశాడు. మరోవైపు తాను ఇచ్చిన పసుపు-కుంకుమ, నిరుద్యోగభృతి, వృద్దులకు పెంచిన పెన్షన్ వంటి వాటి వల్ల కేసీఆర్‌లా తన విజయం కూడా వన్ సైడ్‌వార్ అని గుడ్డిగా నమ్మాడు. ఇక ఆంధ్రా అక్టోపస్‌గా పేరున్న లగడపాటి రాజగోపాల్ వంటి వారి సర్వేలు, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత వరకు చంద్రబాబు సీఎం సీటుకి ఢోకా లేదని భజన రాయుళ్లు చెప్పిన మాటలతో ఆకాశాలలో విహరించాడు. తాను పిలుపు ఇవ్వడం వల్లనే మధ్యాహ్నం నుంచి పోలింగ్ ఊపందుకుందని, అర్ధరాత్రి వరకు ఆడవారు, వృద్దులు తనకోసం ఓటు వేయడం కోసమే నిరీక్షించారని అపోహ పడ్డాడు. ఎన్నికల రోజు ఉదయం తెలంగాణ సర్కార్ ఏపీకి బస్సులను వేయకపోయినా తనకు ఓటు వేసేందుకే హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఆంధ్రా ఓటర్లు తమ స్వస్థలాలకు తరలి వెళ్లారని అపోహపడ్డాడు. కానీ ఇవన్నీ పగటి కలలుగా మిగిలిపోయాయి. ముక్కుమూలుగుతూ 23 అసెంబ్లీ స్థానాలకే టిడిపి పరిమితం అయింది.
ఇక పవన్‌కళ్యాణ్ జనసేన తరపున నేరుగా పోటీ చేస్తే తనపై ఉన్న ప్రభుత్వవ్యతిరేక ఓటు జగన్‌కి, పవన్‌కి మధ్య చీలిపోయి తనకే లాభమనుకున్నాడు. ఇక జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్‌కి తెలుగు ప్రజలనాడి తెలియదని ఎద్దేవా చేశాడు. ఇలా ఈ మూడు పీకేలు అంటే పవన్‌కళ్యాణ్, ప్రశాంత్‌కిషోర్, పసుపు-కుంకుమల ద్వారా ఇచ్చిన లంచాలే ఆయన కొంపముంచాయి. మహిళలు ఒక్కచాన్స్ అన్న జగన్‌కే పట్టం కట్టారు. ఇక తీవ్ర ఓటమి బాధలో ఉన్న చంద్రబాబు ఎంత ప్రభుత్వాలు, అధికారులు చేస్తారని భావించినా, స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి రోజున ముందుగా కనీస ఏర్పాట్లను చూసుకోకపోవడం ఆయనలోని వాడుకుని వదిలేసే తత్త్వానికి మరో రుజువుగా అందరు దుయ్యబడుతున్నారు.
స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన అక్కడ శిధిలావస్థ వంటి పరిస్థితుల్లో ఉన్న ఏర్పాట్లు చూసి చివరకు తానే స్వయంగా ఏర్పాట్లు చేశాడు. పనిలో పనిగా ఇక తన తాతయ్య జయంతి, వర్ధంతులను తానే నిర్వహిస్తానని చెప్పి, బాబుకి, బాలయ్యకి షాక్ ఇచ్చాడు. నిజానికి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు రాజకీయాలలో వయసు రీత్యా యాక్టివ్‌గా ఉండే పరిస్థితి లేదు. బాలయ్య, లోకేష్‌లు ఇద్దరు పప్పులేనని అర్ధమైంది. దాంతో జూనియర్ అభిమానులే కాదు.. టిడిపి వీరాభిమానులు కూడా ఇక టిడిపి వ్యవహారాలలో జూనియర్ కీలకపాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. తన తాత జయంతి, వర్ధంతులను ఇప్పటికే తన సొంతం చేసుకున్న జూనియర్ మనసులో ఏముందో భవిష్యత్తే చెప్పాలి.