కోలీవుడ్ స్టార్ సూర్యకి మంచి బ్లాక్‌బస్టర్ వచ్చి ఎంతో కాలం అయింది. ఆయన కిందటి చిత్రం ‘గ్యాంగ్’ కూడా పెద్దగా మెప్పించలేకపోయింది. అటు తమిళం, ఇటు తెలుగు... ఇలా రెండు భాషల వారిని సంతృప్తి పరచాలనే ఉద్దేశ్యంలో ఆయన చేసిన చిత్రాలు గాడితప్పాయి. అయితే విచిత్రంగా ఆయన విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో నటించిన ‘24’ చిత్రం కోలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ మెప్పించింది. మొత్తానికి సూర్య అండ్ ఎన్జీకే టీం మనసులో ఏముందో తెలియదు గానీ ‘ఎన్జీకే’కి తెలుగుకు సంబంధించిన ప్రమోషన్స్ నత్తనడకన సాగుతున్నాయి. విడుదలకు రెండు మూడు రోజుల ముందుగా ఈనెల 28న తెలుగులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం చూస్తుంటే యూనిట్ తెలుగుపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.
ఇక తెలుగు ప్రేక్షకులకు ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రాలతో పరిచయం ఉన్న సెల్వరాఘవన్ అలియాస్ శ్రీరాఘవ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్‌తో తీసిన ‘వర్ణ’ చిత్రం ఘోరపరాజయం పాలైంది. కానీ ‘ఎన్జీకే’ చిత్రాన్ని తమిళంలో మాత్రం సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ సందడి మామూలుగా లేదు. ఇక తెలుగును పట్టించుకోని నిర్మాతలు ఈ మూవీని తొలిసారిగా అంటే కొరియన్ భాషలో విడుదల చేస్తున్నారు. ఇలా కొరియాలో విడుదల కానున్న తొలి తమిళ చిత్రంగా ఇది రికార్డులకు ఎక్కనుంది.
ఇందులో ఓ సామాన్య యువకుడైన సూర్య రాజకీయాలలోకి వచ్చి సమాజాన్ని, ఎన్నికలను ఎలా ప్రక్షాళన చేశాడు? అనే పాయింట్‌తో సాగనుంది. ఇందులో సూర్యకి భార్యగా సాయిపల్లవి నటిస్తుండగా, సూర్యని గైడ్ చేసే పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తుండటం విశేషం. క్రికెట్ విశ్వకప్ జరుగుతున్న సమయంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారంటే కేవలం కంటెంట్ మీద నమ్మకంతోనే అని అంటున్నారు. మరి ఈ చిత్రం సూర్యకి టాలీవుడ్‌లో కాకపోయిన కోలీవుడ్‌లో ఎలాంటి ఓపెనింగ్స్‌ని, విజయాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది....!