మొన్న జరిగిన ఎన్నికల్లో ఏపీలో జనసేన పార్టీ వామపక్షాలు, బిఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా కేవలం రాజోలు సీటుతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. అనూహ్యంగా పవన్‌కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన ‘భీమవరం, గాజువాక’ రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యాడు. మరోవైపు పవన్ పట్టుపట్టి నరసాపురం ఎంపీగా పోటీ చేయించిన మెగాబ్రదర్ నాగబాబు గానీ, విశాఖ నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా విజయం సాధించలేకపోయారు. కానీ పవన్ మాత్రం తాత్కాలిక, వెంటనే అధికారం సాధించాలని పార్టీ పెట్టలేదు.
25ఏళ్ల విజన్‌తో ముందుకు వెళ్దాం, ప్రజల పక్షం వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దామని తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, ఓడిన అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశాడు. ఈ విషయంలో పవన్ మనోధైర్యాన్ని, దృఢసంకల్పాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక జీరో పాలిటిక్స్, ధన ప్రభావం లేని ఎన్నికలు, అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడం వంటి పలు సమూల మార్పుల ఉద్దేశ్యంతో పవన్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. నేడు ప్రతి ఒక్కరు అయ్యోపాపం అంటున్నారు. మరికొందరు మాత్రం పవన్ ప్రస్తుతం ఓడిపోయినా మీవెంటే మేమున్నామని భరోసా ఇస్తున్నారు.
యంగ్‌హీరో నిఖిల్ ఈ విషయంలో మరింత ముందుకు వచ్చాడు. ఈయన ‘విత్ పీకే’ హ్యాష్ ట్యాగ్‌తో పవన్ ఓడిపోయినా, గెలిచినా మేమంతా పవన్‌వెంటే ఉంటామనే అర్ధం వచ్చేలా ఉద్వేగంగా స్పందించాడు. విత్‌పీకే హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన క్యాడర్‌లోనూ, పవన్‌కళ్యాణ్‌లోనూ ఆత్మస్ధైర్యం నింపేలా ఆయన మాటలు ఉన్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో జనసేన అభిమానులు, కార్యకర్తలు, కేడర్, సాధారణ ప్రజలు కూడా పవన్‌కి పెద్ద ఎత్తున మెసేజ్‌లు పెడుతున్నారు.