తమిళంలో మంచి విజయం సాధించిన ‘గోలీసోడా’ తెలుగు రీమేక్‌ని లగడపాటి శ్రీధర్ తన కుమారుడు విక్రమ్ సహదేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీశాడు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎవ్వడు తక్కువ కాదు’ అనే టైటిల్‌లో వచ్చిన ఈ చిత్రంలో అన్ని తక్కువేనని చెప్పాలి. ఈ చిత్రం బాగా ఆడితే తన కుమారుడితో వరుస చిత్రాలను నిర్మాత లగడపాటి శ్రీధర్ ప్లాన్ చేశాడు. కానీ ఈ చిత్రం చూసిన వారికి విక్రమ్ సహిదేవ్ చివరి చిత్రం ఇదే అయితే బాగుండును అనిపించింది. ఈ చిత్ర పరాజయంలో దర్శకుడు రఘురాజా తడబాటుకి గురయ్యాడు. దాంతో ఒరిజినల్‌లోని ఆత్మని పట్టుకోవడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యాడని చెప్పాలి. ఈ చిత్రం నలుగురు అనాథలకు, ఓ మాఫియా డాన్ మధ్య జరిగే మైండ్ గేమ్ చిత్రం. కానీ దీనిని ఇంటెలిజెంట్‌గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడి లోటుతనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక క్యాస్టింగ్ కూడా ఈ మూవీ మైనస్‌కి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తానికి ఎంత వేగంగా ఈ చిత్రం వచ్చిందో అంతకు మించిన స్పీడ్‌తో గోడను తాకిన బంతిలా తిరిగి వెళ్లిపోవడం ఖాయమనే చెప్పాలి. ఇక గతంలో విక్రమ్ సహిదేవ్ లగడపాటి శ్రీధర్‌నిర్మాణంలో వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం అవుతూ, అల్లుఅర్జున్ హీరోగా నిర్మించిన ‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రంలో కూడా నటించాడు. సినిమా డిజాస్టర్ కావడంతో ఎక్కువమందికి ఆయన రీచ్ కాలేకపోయాడు. ఇక ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రం డెబ్యూ మూవీగా విక్రమ్ సహిదేవ్‌కి పీడకలగా భావించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.